22, నవంబర్ 2021, సోమవారం

కోటి దీపోత్సవంలో కోటి కాంతులు

 జగదార్యుల ప్రవచనం
 కోటి దీపోత్సవంలో కోటి కాంతులు

జగదాచార్యులు శ్రీమత్‌ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారు కోటి దీపోవత్సవానికి విచ్చేసి అమృత ప్రవచనంతో పేరుకు పోయిన అంధకారాన్ని తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించారు. అందరినీ కలుపుకుని సమతామూర్తి ఆవిష్కరణ ఘట్టం కొద్ది రోజులే ఉన్నాయంటూ, మనను సమాయత్తం పరచడానికి అద్భుత విషయాలు ఆవిష్కరించారు. వారి ప్రసంగాన్ని యధాతథంగా మీ ముందు ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.


‘ఆపదామపహర్తారం  దాతారం సర్వసంపదాం’
‘వందే గురు పరంపరాం’
‘అందరం ఒకసారి చెప్తా
వందే గురు పరంపరాం’
ప్రియా భగవత్‌ బంధువులారా!,
కార్తీకమాసంలో బయటి ప్రపంచానికి చీకట్లను పోగొట్టే, దీపాలను వెలిగించే మహోత్సవాన్ని  ఈ భాగ్యనగరంలో ఆరంభం చేసి అది అనేక ప్రాంతాల్లో వ్యాపించేటట్లు చేయడమే కాకుండా ఈ సందర్భంగా మన హృదయాల్లో ఉండేటటువంటి అహంకారపు చీకట్లను కూడా తొలగించుకోవడానికి కావలసి నటువంటి దైవ సాన్నిధ్యాన్ని మన లోపల ప్రేమ రసాన్ని పొంగింప చేసే అద్భుత మైనటువంటి కార్యక్రమాలకి రూపుదిద్ది నటువంటి మన భక్తి టీవీ, శ్రీమాన్‌ నరేంద్ర చౌదరి దంపతులకి మేము ముందుగా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం.
మాసం కార్తీకం, కృత్తిక దీపోత్సవాలు మన గ్రంధాల్లో, ఆగమాల్లో, ధర్మశాస్త్రాల్లో మహానుభావులు అయినటువంటి ఋషులు మనకు చెప్పారు. ఆచరించాలి అని. ఇప్పుడే మన పూజ్య శ్రీ కుర్తాళం పీఠాధిపతి స్వామి మనకు ఒక అందమైన కథ చెప్పారు.
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది కార్తీక దీపాన్ని గురించి. ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారి యొక్క కుమార్తె. చక్కటి జ్ఞాని, మంచి బుద్ధిమంతురాలు.  ఆ రాజు గారి కుమార్తె జ్ఞానంతో పాటు చక్కటి వినయశీలి కూడా. అయితే ఆ మహనీయురాలిని ఒకసారి అడిగారు, అమ్మా నువ్వు ఏం చేసుకుని ఇంత చక్కటి విద్యను, వినయాన్ని పొందావు తల్లి అని. ఆ పిల్లకి బయటి జ్ఞానంతో పాటు ఆంతరం అయినటువంటి జ్ఞానం కూడా భగవంతుడు అనుగ్రహించాడు.
ఆ పిల్ల చెప్పిందట అయ్యా నేను పూర్వజన్మలో ఒక ఎలకని. జీవులకి కర్మ వల్ల అనేక దేహాలు వస్తాయి కదా అని మరి మన వేదాలు చెబుతున్నాయి. ఈ జీవుడు ఎప్పుడూ ఉంటాడు. జీవుడు సంచరిస్తూ ఉంటాడు దేహంలోంచి దేహంలోకి. కర్మని బట్టి ఒకసారి పైకో ఒకసారి క్రిందకు వెడుతూ వుంటాడు. ఈ వేళ మన మానవ శరీరంలో ఉన్నాం. దీనికి ముందర ఎక్కడున్నావో తెలియదు కదా. దీని తర్వాత ఎక్కడికి వెళ్తామోకూడా మనకు తెలియదు. ఆ పిల్ల చెప్పిందట నేను దీనికి ముందుండే జన్మలో ఒక ఎలకని. ఆలయాల్లో తిరుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడ దీపాల్లో నూనె పోస్తూ ఉంటారు కనుక ఆ నూనెను త్రాగుదాము అని నేను ఆలయాలు తిరుగుతూ ఉండేదని. ఒకసారి కార్తీక మాసం వచ్చింది. ఆలయంలో చిన్న దీపం మినుకు మినుకు మంటుంది. నేను ఆ దీపంలో ఉండే నూనె తాగుదామని వెళ్ళా. అయితే దీపం దాక దిగి అందులో మూతిపెట్టే సమయానికి ఆలయాల్లో సాధారణంగా పిల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి కనుక అక్కడ ఒక పిల్లి కూడా వుంది. అది నన్ను చూసి మ్యావ్‌ మంది. నాకు భయం వేసింది. భయం వేసింది ఆ భయంతోటి దీపం నుంచి కింద పడి పోయా. ఆ తర్వాత నన్ను ఆ పిల్లి తినేసింది. కాని ఆ పడిపోయే సమయంలో నా ముక్కు తోటి అప్పటిదాకా మినుకు మినుకుండే టటువంటి ఆ దీపాన్ని కొద్దిగా పైకి పొడవడం చేత ఆ దీపం పెరిగి పెద్దదై గర్భాలయంలో మంచి కాంతి ఏర్పడిరది.
గర్భాలయంలో దేవుడి ముందర ఒక దీపాన్ని కాస్త పెంచి పెద్ద చేసినటువంటి ఒక సుకృత ప్రభావం ఈవేళ నన్ను ఈ రకమైనటువంటి స్థితిలోకి తీసుకు వచ్చింది.అని ఆ పిల్ల చెప్పినటువంటి చరిత మనకి పురాణాలలో కనిపిస్తుంది. తాత్పర్యం ఏంటంటే ఈ కార్తీకమాసంలో మన అందరం కూడా మనలో ఉండే చీకట్లను తొలగించుకునే ప్రయత్నం చేయవలె. చీకట్లు బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. అంటే రకరకాల స్థానాల్లో ఉంటాయి. ‘ఇంద్రియాణి మనో బుద్ధి: అస్య అనుష్ఠానం వుచ్చ్యతే’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనలో ఉండే కోరికలు గురించి చెబుతాడు. ఈ కోరికలనేటటువంటివి ఒక స్థానంలో ఉండవు అర్జునా. ఇది మన ఇంద్రియాల్లో ఉంటాయి మనసులో ఉంటాయి బుద్ధిలోనూ వుంటాయి అని చెప్తాడు అయన. అట్లాగే మనలో ఉండేటటువంటి అహంకారపు చీకట్లు కూడా ఈ బయటి ప్రపంచంలో వ్యాపించి ఉన్నట్టే మన ఇంద్రియాలోనూ ఉంటాయి వాటిని ఎలా ఎప్పుడు ఎక్కడ పని చెయ్యాలో తెలియకుండా చేయడానికి, మనసులో ఉంటాయి యోగ్యమైన ఆలోచనలు రాకుండా అడ్డటానికి, బుద్ధి లోనూ ఉంటాయి సరిjైునటువంటి నిర్ణయాలను చేసుకోనివ్వకుండా మనని కలత పరచటానికి. ఇన్ని చీకట్లు పోవాలి అనే మనం కోరుకుంటాం. ఈ చీకట్లన పోగొట్టుకోవడం. బయటి చీకట్లు  అయితే దీపాల వల్ల పోగొట్టుకుంటాం మనం. ఎన్ని లైట్లు వెలిగించాం. మరికొన్ని దీపాలను కొంచం సేపటికి వెలిగించ పోతున్నాం. కానీ లోపల చీకట్లని పోగొట్టేది ఎట్లా. దేనితో లోపలి చీకట్లు పోతాయి.
ఇవాళ ప్రపంచంలో ఎన్నో రకాల చీకట్లు వస్తున్నాయి. కేవలం ధనమే ప్రధానం అనుకోనేటటువంటి ప్రవృత్తులు మనం ప్రతిరంగంలోనూ చూస్తున్నాము. ఇది ఒక రకమైనటువంటి భయంకరమైన చీకటి. మనిషికి కర్మ వల్ల వచ్చింది దేహం అనేది. ఇది మనకి తెచ్చుకుంటే రాలా. మన ఎవరి దగ్గర అప్లికేషన్‌ పెట్టి మనం దీన్ని సంపాదించలా. మన తల్లిదండ్రుల దగ్గర కూడా మనం కోరి ఈ దేహాన్ని మనం పొందాలా. ఎవడో ఇచ్చాడు. ఎవడిచ్చాడో మనకి తెలీదు. కానీ ఎవరో ఇస్తేనే ఇది వచ్చింది. దేహంతో పాటు ఈ వేళ మనం ఇవి అని అనుకునే లింగము కానీ, వయసు కానీ, కులము కానీ, వర్గము కానీ, వర్ణము కాని, రంగు కానీ ఇవేమీ మన తెచ్చుకుంటే రాలె. మనం తీసేస్తే పోవు. తాత్కాలికంగా వేసుకొనే రంగులు వల్ల కొన్ని తాత్కాలికంగా కనిపించకపోవచ్చు కానీ సహజమైన టటువంటి స్థితి మారేది కానే కాదు ఈ దేహం ఉన్నంత వరకు కూడా. మనం తెచ్చుకోకుండా వచ్చిన దాన్ని చూసి మనం గర్వపడ్డం ఏం తెలివంటాం.
కులం పేరుతో, మతం పేరుతో, వరణం పేరుతో, వర్గం పేరుతో, రంగు ఆ మధ్య దాకా ఇతర దేశాల్లో ఎంత పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి. కేవలం రంగు గురించి. శారీరకమైనటువంటి వారు తెచ్చుకోకుండా వచ్చినటువంటి రంగు గురించి. ఇది ఒక భయంకరమైనటువంటి చీకటి. ఈ వేళ మనం చూస్తున్నాం ఒకే మతానికి సంబంధించి నటువంటి వ్యక్తులలో కూడా తమ వారిని తామే చూసి సహించలేని ఒక దారుణమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం వాయువ్య దేశాల్లో.  ఎందుకు వస్తున్నాయి ఇవి. లోపల ఏర్పడ్డ చీకటి ప్రభావం చేత. ఈ చీకట్లు తొలగాల్సిన అవసరం ఉన్నది. ఇది మనకి జ్ఞాపకం చేయడం కోసమే ఈ బయట దీప ఆవిష్కరణ చేసుకోవడం.
ఈ కార్తీకమాసంలో రాబోయేటటువంటి ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని పేరు పెట్టారు మహానుభావులు అటువంటి మన పెద్దలు, ఋషులు. ఉత్థాన ఏకాదశి అంటే భగవంతుడు మేల్కాంచేటటువంటి ఏకాదశి అని అర్థం. ఆ మరునాటికి క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. స్వామి పాలకడలిలో పవళించి నాలుగు నెలలపాటు, ఆ ఏకాదశి నాడు మేల్కాంచి ద్వాదశినాడు క్షీరములతోటి అభిషేకిస్తాడట ఆయన యొక్క సందర్శనానికి సకలదేవతలు సమావిష్టులు అవుతారట. దాన్ని స్మరించుకుంటూ కార్తీక పూర్ణిమ నాడు చాలా అద్భుతమైనటువంటి ఉత్సవాలు చేస్తారు. ఆలయాలన్నిటా కూడా పవిత్రోత్సవాలు కూడా చేసుకుంటారు. స్వామి యొక్క ప్రభావం లోకమంతా తెలుయు గాక, స్వామి యొక్క ప్రభావం అందరి దుఃఖాలన్నీ దూరం చేయుగాక. భగవంతుడి యొక్క ప్రభావం అందరిలో చీకట్లో కూడా తొలగించుగాకా అని ప్రార్థనలు చేస్తూ ఆలయాల్లో పవిత్రోత్సవాలు చేస్తారు. స్వామి మేల్కాంచే చేసే సమయానికి మనం సిద్ధపడాలి కదా, ఆయన నిదిరించినా మన కోసం, ఆయన మేల్కాంచినా మన కోసమే. నిజానికి భగవంతుడికి ఏ ఆయుధాలు ఉండవు, ఏ అలంకరణలు ఉండవు, అవసరంలేదు కూడా. కానీ ఆయన ఆయుధాలను ధరిస్తాడు, అలంకరణలని స్వీకరిస్తాడు ఎవరి కోసమని. మహానుభావుడు లేనటువంటి ఋషులు చెప్పారు
     నాతే రూపం నచ ఆకారః నాయుధానీ నచ ఆస్పదం
     తథాపి పురుషాకారః భక్తానాం త్వం ప్రకాశసే.
హే భగవాన్‌ నీకు ఇదమిత్థంగా ఇంతే రూపం అనే హద్దు లేదు. అర్థాత్‌ అన్ని  రూపాలు నీవే. ఆయన పొట్టి వాడు, పొడుగు వాడు, లావు వాడు, సన్నని వాడు ఇలాంటి ఆకృతులు ఆయనకి పరిమితమై లేవు. అంటే ఈ లోకంలో చూసే అన్ని ఆకృతులు ఆయనవే. వీటికంటే అతీతమై ఆయన ఉంటాడు అని అర్థం. ఆయనకు ఏవో కొన్ని మనకి తెలిసిన ఎటువంటి పరిమితమైన కొన్ని ఆయుధాలు అర్పిస్తా, కానీ అంతవరకే ఆయనకు సీవితము కాదు అంటే సకల ఆయుధాలు ఆయనవే కాని ఆయనకు అవసరం లేదు. ఆయన వైకుంఠంలో ఉంటాడా, కైలాసంలో ఉంటాడా, పాల్కడలిలో ఉంటాడా, అయోధ్య నా, బృందావనమా మరొకటా. ఆయనకు ఇదమిద్దం అనేటటువంటి చోటు లేదు. లేదు అంటే ఆయన ఎక్కడ ఉండడానికి కాదు అని అర్థం ఆయన పరిమితుడు కాడు అని అర్థం. ఆకాశానికి చోటెక్కడ? మీ ఊర్లో నా, మా ఊర్లో నా, మీ పెరట్లో నా, మా పెరటిలోనా ఆకాశం అంతటా అది లేని చోటంటూ లేదు. గాలికి చోటు ఎక్కడ. అంతటా ఉంటుంది లేని చోటంటూ లేదు. ఈ గాలి, ఆకాశం లాంటివే ఇలా ఉంటే, అలాంటి వాటిని లో తన దేహంలో మూల కలిగినటువంటి ఆయనకి ఇది చోటు, ఇది స్థానము, ఇది ఆకృతి అని ఎట్లా చెబుతామయా? నువ్వు ఏ రూపం చూసిన అది ఆయన రూపమే. అర్జునుడుకి సందేహం కలిగితే పదకొండవ అధ్యాయంలో చూపించాడు తనయోక్క విరాట్‌ రూపాన్ని. పాపం అర్జునుడు కాస్త గాబరా పడిపోయాడు. ఏమి అవుతుందో తెలియదు, ఎక్కడున్నానో తెలియలేదు, చుట్టూ ఏమవుతుందో తెలియలేదు. అమ్మో అమ్మో నేను చూడలేనీ రూపాన్ని ఆది తెలియటం లేదయా, మధ్యమూ తెలియటం లేదయా, అంతమూ తెలియటం లేదయా. నన్ను అనుగ్రహించి ఈ రూపం నాకొద్దు. నాకు బాగా అలవాటు అయినటువంటి రూపం చూపించవా అని అడిగాడు అర్జునుడు.  అన్ని రూపాలు చూపించాడు తనలో,  అలాంటివాడు అయినప్పటికినీ కూడా ఎందుకోసం ఆయనకు ఒక ఆకృతి, ఒక రూపం, కొన్ని ఆయుధాలు, ఏవో కొన్ని స్థానాలు ఎందుకు ఏర్పాటు చేశారు? చేయలా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికోసం, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరి హృదయాల్లో ఉండేటటువంటి చీకట్లు తొలగించుకుని వెలుగులు నింపుకోవాలని కోవాలనే కోరికతో తమ హృదయములనేటువంటి కలశాలను సిద్దం చేసుకుని పెట్టుకుంటారో అందులో ప్రేమ రసాన్ని నింపడం కోసం అని. వారి కోసం నువ్వు రూపధారణ చేస్తావు. వారికి ఏది నచ్చితే అట్లా, ఎంత నచ్చితే అంత. నది దగ్గరికి వెళ్లిన వాడికి తాను తీసుకువచ్చిన అటువంటి పాత్రకి తగ్గట్టుగా అందులోని నీటిని తీసుకున్నట్టుగా ఎట్లా అవకాశం ఆ నది ప్రసాదిస్తుందో సర్వేశ్వరుడు అయినటువంటి భగవానుడు కూడా తనని ప్రేమించేటటువంటి భక్తశిఖామణుల కోసమని వారు వారు ఏ యోగ్యతని మనసులకు కలిగించుకుంటారో, దానికి తగ్గట్టుగా తనని తాను రూపుదిద్దుకొని వాళ్ళ హృదయాల్లో నిండాలి అని కోరుకుంటాడు. అందులో వుండేటటువంటి స్వచ్ఛమైన ప్రేమకి తన అభిషిక్తుడు అవుతాడు.
పాలతో అభిషేకం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి రేపు రాబోయే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో వస్తుంది మనకి అయితే అది మామూలు బయట దొరికేటటువంటి పాలు కావు. ఆ పాలు ఇచ్చేవి మనం మామూలుగా చూస్తూ ఉండేటటువంటి గోవులు కావు. సర్వోపనిషదో గావః అని చెప్పినట్లుగా వేద వాజ్ఞ్మయమంతా గోవులయితే అవి ప్రసాదించేటటువంటిది భగవంతుని యొక్క దివ్యమైనటటువంటి అద్భుతమైన కల్యాణ గుణాలనే క్షీరము. ఆ క్షీరంతో స్వామిని అభిషేకించాలి. అలా అభిషేకించాలి అనుకునే వారి కోసం అని తాను ఆ పాల్కడలి నుంచి మేల్కొంటాడు. వారి యొక్క ప్రేమకి తాను కరుగుతాడు. వారేం చెబితే అది చేస్తాడు.
యశోదమ్మ రోటికి కట్టి, చేతిలో బెత్తం పట్టి, నోటిని తెరిచావంటే అమ్మో కొట్టేస్తుంది ఏమో అని భయం వేసి, నోరు తెరవటానికి భయంవెసి, లోపల్లోపలే తన రొమ్ములు ఎగరవెస్తూ, అసలే నల్లనివాడు, కంటికి నల్లని కాటుక, కారే నీళ్లతో ముఖమంతా పులుముకుంటూ ఏడుస్తూ నిల్లబడ్డాడు. మరి చేతకానివాడుకాదు. ప్రేమ అనే త్రాటికి కట్టబడ్డాడు. ప్రేమ కలిగినటువంటి ఒక నారీమణి ప్రేమకి తాను కట్టించుకున్నాడు రోటికి. కానీ దురహంకార పూరితులైన వ్యక్తులకి దరి చేరడానికి కూడా అవకాశం ఇవ్వని అప్రతిహతుడు అయ్యాడాయన. ప్రేమ కలిగిన వారి కోసం నువ్వు ప్రకాశిస్తావు, ప్రకాశం చేసుకుంటారు. వాళ్లే రూపం కోరితే ఆ రూపంలో, యశోదమ్మ నీ బాల లీలలు చూడాలయ్య అంది, అందుకోసం బాలుడుగా చూపించావు, అంతకుముందు దేవకీ దేవి నా గర్భాన జన్మించమని కోరింది, గనుక జన్మించాడు. ఎవరెంతకోరితే వారికి అంత. బాల లీలలు చూపమంటే అక్కడ లీలలే చూపించడం జరిగింది.
గురువు అంటే మనలో ఉండేటటువంటి చీకటి, అది ఎంతదైనా దాన్ని పారద్రొలెటటువంటి శక్తి కలిగిన మహనీయుడు అన్నమాట. కొన్ని కొన్ని గుహల్లో కొన్ని వేల సంవత్సరాలుగా చీకటి అతి దట్టంగా పులుముకొని ఉంటుంది. చీకటి పారద్రోలడానికి ఒక దీపం చాలు. అయితే అలాంటి చోట్ల వెలిగించడం అనేది చాలా కష్టం. కానీ వెలిగించగలిగిన వ్యక్తులు అయితే కావాలి. ఆ వ్యక్తులను మనం గురువు అంటాం. అయితే ఇందులో చిన్న చిన్న చిన్న చిన్న పదాల మార్పులు మన పెద్దలు సూచించారు. గురువు, అధ్యాపకుడు ఆచార్యుడు ఇలా కొన్ని పదాలు చెప్పారు. గురువు అంటే సామాన్యంగా ఏ చీకటినైనా పోగొట్టేవాడు. మనకి అ ఆ లు రావు అనుకోండి అక్షరాలు దిద్దించిన వాడు కూడా గురువే అవుతాడు. మన చుట్టూ ఉండే పరిసరాలను పరిచయం చేసే వ్యక్తి కూడా గురువే అవుతాడు. కానీ మనని ఉజ్జీవింపజేసే అంటే మనని మనం తెలుపు కొనగలిగేటటువంటి, మామూలుగా అయితే శరీరం బతకడానికే జీవన అంటాము. లోపల ఉండే వాన్ని కూడా తెలిపేదే ఉజ్జీవం అంటాము. ఉజ్జీవింప చేసేటటువంటి గ్రంథాలని మనకి తెలియజేస్తే అధ్యాపనం అంటాం. అందులో ఉండేటటువంటి సారాన్ని తానాచరించి మనకి ఆచరింప చేయగలిగే యోగ్యుడు అయితే ఆయన్ని మనం ఆచార్యుడు అంటాము.
ఈ సమాజానికి జ్ఞాన దీపాన్ని వెలిగించిన ఇటువంటి మహానుభావులు అయినటువంటి ఆచార్యులు ఎందరో వున్నారు. ఆదిశంకర భగవత్పాదులు దగ్గర నుంచి మనం ఆరంభం చేస్తే, ఆ తరువాతి కాలంలో అంటే పదకొండవ శతాబ్దంలో ఈ జాతికి మానవజాతి కంతటికీ కూడా అద్భుతమైనటువంటి ఉజ్జీవన మార్గాన్ని చూపినటువంటి ఆచార్యవర్యుడు భగవద్రామానుజ ఆచార్య స్వామి. వైదిక మార్గాన్ని ముల్లు తీసి సుగమంచేశారు శంకరభగవత్పాదులు. ఆ మార్గంలో అందమైన భవనాలు నిర్మించారు భగవద్‌ రామానుజాచార్య స్వామి.  ఈ సమాజానికి ఆ మహానుభావులు చూపినటువంటి మార్గం సర్వధా సర్వధా శరణ్యం. విశేషించి పదకొండవ శతాబ్దానికి పూర్వం దేవుడి గురించిన మాట బయట చెప్పటానికి వీలు లేకుండా ఉండేది. ఆడవాళ్ళయితే దేవుడి మాట ఎత్తటానికి వీల్లేదు. దేవుడు గురించి చెబితే నాలిక తీసేయాలి. వింటే చెవుల్లో సీసంతో మూసేయాలి. కరిగించిన సీసం తోటి. ఇది వాస్తవం ఆ రోజుల్లో ఉండేది. అలాంటి మాటలు మరి కొన్ని పుస్తకాలు కూడా ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ రోజుల్లో దాన్ని కఠినంగా పాటించేవారు కూడా.
 మనమంతా శంకరభగవత్పాదులు యొక్క కథని చదివి ఉంటాము ఆ మహానుభావుడు స్నానమాచరించి బయటకు వస్తే ఎదురుకుండా ఒక దళితుడు కనిపిస్తే మే నడిచే మార్గం లోకి రాకూడదని తెలియదా తప్పకో ఇక్కడినుంచి అంటే ఆ వ్యక్తి అడిగాడట ఆ మహనీయుని శంకరభగవత్పాదులు వారిని. ఎవరిని తొలగమంటావ్‌ ఇక్కడి నుంచి శరీరాన్నా, ఆత్మనా అని అడిగాడు. శరీరం పంచభూతాలు అవి వాటిని మనం ఏం చేసే ప్రశ్నే లేదు. వాన వస్తే నీళ్లలో తేవాలని, ఎండ స్తే కావాల్సింది, నేలమీద మట్టి వుంటే అంటించుకోవసిందే, కనక పంచభూతాలను తొలగమనడానికి సరైనటువంటి కాదు. ఇక ఆత్మ అంటావా? నీ సిద్ధాంతాల్లో సర్వవ్యాపి కదా, అంతట ఉండేది కదా, అది లేని చోటే లేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళమంటారు. కథ చెప్పడానికి ఇప్పుడు మేము ఆ విషయాన్ని ప్రస్తావన చేయలేదు. కానీ ఆనాటి సామాజిక మైనటువంటి స్థితి అట్లా ఉండేది. ఎవరి తప్పు కాదు. ఒక నాటి సమాజ స్థితి అది.
రామానుజాచార్యులవారు పదకొండవ శతాబ్దంలో వచ్చినప్పుడు సమాజంలో ఉండేటువంటి అసమానతలని వారు గమనించారు. 32 సంవత్సరాల కాలం జీవించి ఉన్నాడు శంకరభగవత్పాదులు. కొద్దిపాటి సమయంలో ఆ మహనీయుడు సాధించినటువంటి కార్యం వర్ణనాతీతం.  వారు మరి కొంత కాలం జీవించి ఉంటే రామానుజాచార్యులవారి అవసరం వచ్చి ఉండేది కాదు సమాజానికి. కాని తరువాత రామానుజాచార్యులవారు 120 సంవత్సరాల కాలం ఈ భూమ్మీద వేంచేసి ఉండి నలుచెరగులా వారు సంచరించి, సమాజంలో ఉండేటటువంటి రుగ్మతలను గమనించి వాటిని నిర్మూలించే అటువంటి మహోద్యమాన్ని సాగించారు.
కులం ఏదైనా, జాతీయ ఏదైనా రంగు ఏదైనా, లింగం ఏదైనా మనమందరం పుట్టింది ఈ మట్టి మీద. ఈ భూమాత మనందరికీ కన్నతల్లి. ఈ భూమిని ఉద్ధరించిన ఇటువంటి భగవంతుడు అందరికీ తండ్రి. మనందరం వారి సంతానమే. కర్మ వల్ల ఏర్పడ్డ దేహాల వల్ల మనలో అంతరాలు ఉన్నప్పటికీని మనందరం ఒకే భగవంతుడికి సంతానం అయితే ఆ భగవంతుడిని నామాన్ని చెప్పటానికి, తండ్రి తల్లి యొక్క నామాన్ని పలకడానికి అవరోధం ఎందుకు ఉండాలి. ఒకవేళ కొందరు దీనులో, దళితులో అయితే నిజానికి భగవంతుడి యొక్క ప్రేమ వాళ్ల యందే అధికముగా ఉంటుంది, అందరికి తెలుసును. ఒక తల్లికి ఒక పిల్లవాడు సామాన్యంగా ఆరోగ్యంగా ఉండి మరొక పిల్లవాడు కొంచెం అనాకారి అయితే, లేదు అంగవికలుడు అయితే తల్లికి ఎవరి మీద ఎక్కువస్మరణ ఉంటుంది. ఏదైనా ఒక స్వీటు హార్టు చేస్తే ఎవరిని ముందు తలుచుకుంటుంది ఆ తల్లి.
ఎవరు కాస్త అనాకారో వాణ్ని ముందు తలుచుకుంటుంది. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దీనులని, దళితులనే ముందు స్మరిస్తాడు. ఎందుకంటే వారియందు తన కృప ఎక్కవ అవసరం కనుక. అందుకే మనకి భగవంతుడు మీద నిజమైన ప్రేమ ఉన్నట్లయితే, భగవంతుని మనం నిజంగా కనుక మనం గౌరవించ తలచుకుంటే, ఆయన ప్రేమ ఎవరి యందు ఉంటుందో వారిని ముందు మనం జాగ్రత్తగా గమనించడం బాధ్యత. అందుకే దళితులకి కూడా ఆ భగవంతుని దర్శించే అధికారం కావాలి అని వాళ్ళకి కూడా ఆలయ ద్వారాలు తెరిచి భగవంతుని దర్శింప చేసినటువంటి చారిత్రక ప్రధమ ఆచార్యుడు భగవద్‌ రామానుజ ఆచార్య. అలాంటి వాళ్లకి కూడ శ్రద్ధ కలిగితే నేను కూడా బాగు పడాలని కోరిక కలిగితే వారికి కూడా భగవంతుడి మంత్రాన్ని అందించాలి అని భగవాన్‌ మంత్రాన్ని అందరు అందించినటువంటి మహోదార వ్యక్తిత్వం రామానుజ ఆచార్యునిది. అందుకే రామానుజాచార్యులు ఒక మత గురువు కాదు ఒక సంఘ సంస్కర్త. ఆ వేళ మహిళలకు కూడా సాధికారికత అందించినటువంటి మహనీయుడు భగవద్రామానుజ ఆచార్యుడు. ఇవాళ సమాజంలో పరస్పరము వ్యక్తుల మధ్య అధికారపు పోరాటాలు, లేదు రకరకాలైన ఇటువంటి విపరీత ధోరణులు తోటి అణిచివేత చర్యలు మనకు కనిపిస్తున్నాయి అంటే వ్యక్తులలో ప్రేమ లోపమే కదా దానికి కారణం. నా వాడు కాదు అనుకుంటే ఎలా ఉన్నా కగలించు కోవాలని కోవాలనిపిస్తుంది. నా వాడు కాదు అనుకుంటే వాడెలా వున్నా దూరం అనాలనిపిస్తుంది.
నా ఈ భావన కావాలి. అయితే ఆ భావన మనలో ఎందుకు కలుగుతుంది నువ్వెవరో, నేనెవరో కానీ మన అందరం ఒకటి అనే విషయం తెలియ చేయాలంటే మన అందరి మధ్య ఒక కామన్‌ కనెక్టవిటీ కావాలి. అందరి మధ్య ఉండేటటువంటి ఒక సంబంధం దైవం తోటి మాత్రమే. అందుకే మనం అంతా భగవద్‌ బంధువులకు. భగవంతుడు ద్వారా సంబంధించిన వాళ్ళం, పరస్పరము సహోదరులను అవుతాం అందుకే దానిని గుర్తింపు చేయడానికి అవసరమైనటువంటి ఆ నారాయణ మహామంత్రాన్ని గోపురమెక్కి రుచి కలిగిన వారికి తాము అందించడమే కాకుండా ఈ విశాల విశ్వంలో ఎక్కడ ఎవరికి రుచి ఉన్నా ఈ మంత్రాన్ని అందించండి. అంటూ ఒక అవిచ్ఛిన్న మైనటువంటి పరంపరని కొనసాగించడం మహనీయుడు భగవద్‌ రామానుజాచార్య స్వామి. ఈ వేళ సమాజంలో మనం చూస్తూ ఉండి ఉంటే అంతరాలు అంతరించాలంటే, నా అనే ప్రేమ తిరిగి మనలో రావాలి. అందుకే ఈ వేళ సమాజానికి మళ్లీ  రామానుజుల వారు అందించిన సందేశం స్పూర్తి కావాలి. అనే మన ఈ భాగ్యనగరంలో, ఈ భాగ్యనగరానికి కాదు మన దేశానికి, ప్రపంచానికి శోభాయమానంగా భగవత్‌ రామానుజుల వారి వెయ్యేండ్ల పండుగ మనం పురస్కరించుకుని ఒక అద్భుతమైనటువంటి మూర్తి ప్రతిష్టాపనని రేపు మాఘ మాసం ఆరంభం కాగానే అంటే ఫిబ్రవరి 2 నుంచి 14 దాకా ఒక 1035 కుండాల తోటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణ మహాయజ్ఞం అక్కడ జరగబోతోంది. మనకి లభించేటటువంటి నాలుగు వేదాల్లో సుమారు ఏడు శాఖలు ఉన్నాయి. వాటన్నిటికీ పారాయణం జరగబోతోంది. వాటితో హవనం జరగబోతోంది. మన వైదిక వాజ్గ్మయం అంతా అక్కడ శ్రవణం చేసే అద్భుతమైనటువంటి అవకాశం మనకి దక్కబోతోంది.
మన ప్రధాని, రాష్ట్రపతి దాంట్లో పాల్గొనబోతున్నారు. మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జరుపుకొందాం. ఇక్కడ మన ఈ భాగ్యనగరంలో కొన్ని సంవత్సరాలుగా ఈ దీపోత్సవాన్ని మనందరం కలిసి జరుపుకోవాలి అని ఒక సామాజిక కార్యక్రమం భక్తి టీవీ అందిస్తోందో అట్లాగా ఈ భక్తికి మూలబీజమైనటువంటి రామానుజుల వారి యొక్క మూర్తి ఆవిష్కరణ మహోత్సవం కూడా మన అందరం కలిసి జరుపుకుందాం. ఈ కార్యక్రమానికి మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి ఎందరో అతిధులు వస్తారు. మనమందరం ఆథిధేయులుగా వచ్చే వాళ్ళని స్వాగతించి వారికి తగినటువంటి ఏర్పాట్లు చేసి వచ్చిన వారికి సంతృప్తిగా అబ్బా చాలా బావుంది అని చేసి పంపడం మనందరి బాధ్యత. మన చౌదరి గారు ఇప్పుడే చెప్పారు మా తోటి స్వామి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నావో రేపు రాబోయే కార్యక్రమంలో అక్కడ కూడా ఇంతకంటే మంచి అద్భుతమైన ఏర్పాట్లను చేసే బాధ్యత మేం తీసుకోబోతున్నాం అని. చాలా సంతోషంగా ఉంది అన్నమాట.మనమందరం కూడా ఆథిదేయులమే. మన ఊరు వచ్చిన వారికి తృప్తి గా తిరిగి వెళ్ళగలిగే టటువంటి వ్యవస్థ అందరం కలిసి చేసుకుందాం.
రామానుజులవారు అందించినటువంటి సమతా స్పూర్తికి ఇది ఒక స్థలంగా తయారు చేద్దాం. అందరిలో కూడా ఒక ప్రేమ, ప్రవాహం దానికే భక్తి అని పేరు అది మంచి విషయాల్లో ఉంటే. ప్రేమకే రకరకాల పేర్లు ఉన్నాయి. పిల్లల విషయంలో ఉంటే వాత్సల్యం అంటాం. పెద్దల విషయంలో ఉంటే గౌరవం అంటే, సమాన వయస్కుల మధ్య ఉండే సఖ్యమంటాం లేదా స్నేహమంతా, భిన్న లింగాల మధ్య ఉంటే దానిని కామమంటాం. పెద్దల విషయంలో దైవపు విషయంలో, మంచి విషయాల్లో ఉంటే దానికి భక్తి అని అంటాం. అయితే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ అనేది ఇప్పుడు కూడా ఏదో చెయ్యాలి అనేదాన్ని డిమాండ్‌ చేస్తుంది.
మీరు చిన్న పిల్లల మీద ప్రేమ కలిగింది అనుకోండి ఒక పండు ఇవ్వాలనిపిస్తుంది. ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది ఎత్తుకుని ముద్దాడాలి అనిపిస్తుంది. ప్రేమంటే ఏదో చేయకుండా ఉండనివ్వదు. భగవంతుడి మీద మంచి విషయాల మీద మన ప్రేమ ఏర్పడితే ఆ మంచిని పదిమందికి పంచడానికి పెంచుతూ పెంచుకోవటానికి మనలో కూడా ఒక ఆరాటం ఏర్పడుతుంది. దానిని మనం అందరం కూడా మన నగరానికి రాబోయేటటువంటి అతిథులందరికీ కూడా అందిద్దాం. రాబోయే  ఫిబ్రవరిలో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి సంసిద్ధులను అవుదాం. ఈ కార్తీకమాసం రాబోయే మాఘ మాసానికి కాంతిని ప్రసాదిస్తూ దీపపు దారులని మనకి అందిస్తూ ఇవాళ  ఆరంభం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమాన్‌ చౌదరి గారు ఇక్కడ చేసినటువంటి అద్భుతమైనటువంటి శుభారంభం ఈ రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి మరింత కాంతిని ప్రసాదించాలి అని దీనిని అందరూ చక్కగా వినియోగించుకుని తమలో జ్ఞాన జ్యోతులను ప్రేమ జ్యోతులను ప్రకాశింప చేసుకునేటట్లుగా తీర్చిదిద్దాలి అని మేము ఆశిస్తూ. మీకు అందరికీ కూడా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం. విశేషించి శ్రీమాన్‌ నరేంద్ర చౌదరి దంపతులకు ఇలాంటి కార్యక్రమాన్ని మరింత చక్కగా చేయగలిగేటటువంటి అవకాశం, శక్తి భగవంతుడు ప్రసాదించాలని మేము ప్రార్థన చేస్తూ  జై శ్రీమన్నారాయణ
వందే గురు పరంపరాం


12, సెప్టెంబర్ 2021, ఆదివారం

స్ఫూర్తి ప్రదాత మన పెదజీయర్‌

స్ఫూర్తి ప్రదాత మన పెదజీయర్‌
 


ప్రాచీన ధార్మిక సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా, భగవంతుడు స్వయంగా తన భక్తులను ఈ ప్రపంచానికి పరమ భాగవతోత్తములుగా పంపుతాడు. వంద సంవత్సల క్రితం విదేశీ పాలనలో మన సంప్రదాయాలకు గ్రహణం పట్టింది. ఆ తరుణంలో తిరిగి మన సంప్రదాయాన్ని పురుజ్జీవింప జేయడానికి  బాటలు వేసిన ఆచార్యులు మనపెద్దజీయరు స్వామి. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామీ వారి తిరునక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని వారి జీవన గమనంలో నూతనోత్తేజం కలిగించిన అంశాలను మననం చేసుకోడం మన బాధ్యత.
ఆచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామీ దివ్య రూపంలో శ్రీ రామానుజుల చైతన్యం నింపే స్ఫూర్తి మరియు ఆదర్శం కనిపిస్తాయి.  నాడు శ్రీ రామానుజులు స్వయంగా సమాజ ఉద్ధరణకోసం అడుగులు వేసిన విధంగా  పెద్ద జీయర్‌ స్వామీ మార్గనిర్దేశకత్వం చేశారు.  ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉద్యమ స్పూర్తికి శ్రీకారం చుట్టారు.
సమాజంలో ప్రజలకు శాంతి, శ్రేయస్సు కొరకు అనేక యజ్ఞాలను నిర్వహించి ఒక స్ఫూర్తి సందేశాలను మనకు పెద్ద జీయర్‌ స్వామీ అందించారు. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలను  తొలగించడానికి స్వామీజీ అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.  న్యూఢల్లీిలోని రామ్‌లీలా మైదానంలో  1973లో అఖిల భారత వేద సదస్సును నిర్వహించారు. స్వాతంత్య్రానంతరం నిర్వహించి ఈ సదస్సు ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే సదస్సులో కేవలం పదిహేను నిముషాలు హాజరవుతానని వచ్చిన అప్పటి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ  సంప్రదాయాలు మరియు సంస్కృతి వైభవాన్ని కాపాడడంలో  పెద్ద జీయర్‌ స్వామీ చేసిన  కృషిని ప్రశంసిస్తూ, వారి కార్యకలాపాలను కొనియాడుతూ  సదస్సులో రెండు గంటలు గడిపారు. సదస్సుకు వేల సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. మచ్చుకు ఇది ఒక్క సంఘటనే ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అద్భుత విషయాలు గోచరిస్తాయి.
కాకినాడలో 1909 సెప్టెంబర్‌ 1 న శ్రీ వంగిపురం మంగయ్యార్య, చూడాంబ దంపతులకు పెద్దజియర్‌ స్వామి జన్మించారు. నామకరణం కాని పసిబాలుడి రక్షణకు ఆదిశేషుడే దిగివచ్చాడు. ఆనాటి సంఘటనతో వారికి 'తిరువెంగళాచార్యులు' అని నామకరణం చేశారు. సంస్కృతం, తార్క, న్యాయ, వేదాంతాలను అధ్యయనం చేస్తున్న సమయంలోనే వారు శ్రీమాన్‌ గోపాలాచార్య స్వామి వారిని కలిసారు. తమిళ ప్రబంధం శ్రీ గోపాలాచార్య నుండి నేర్చుకున్నారు. గాంధీజీ పిలుపునకు  ఆకర్షితులయిన శ్రీమన్నారాయణ స్వాతంత్య్ర ఉద్యమంలో 1920లో పాల్గొన్నారు.  
1954 సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని స్వీరించారు. 1954 సంవత్సరం జూన్‌ 12న  బద్రీనాథ్‌ వద్ద ఆశ్రమం ప్రారంభించారు. వేద సంప్రదాయాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యాంతో ఆచార్య, శ్రీమాన్‌ గోపాలచార్య స్వామితో  కలిసి పనిచేయాలని సంకల్పించుకున్నారు. తోలుత వారు దక్షిణ భారతంలో శ్రీవైష్ణవంపై దృష్టి సారించారు. విశిష్టాద్వైత విలువలను పునరుద్ధరించడానికి వారు కృషి చేశారు. విశిష్టాద్వైత ప్రచారక సంఘానికి శ్రీ గోపాలచార్య స్వామి అధ్యక్షులు కాగా కార్యదర్శిగా  శ్రీమన్నారాయణచార్య సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తమిళనాట రామాపచారము జరిగినప్పుడు ప్రాచీన సంస్కృతిని కాపాడటంలో భాగంగా సుమారు మూడు వందల మంది పండితులతో తమిళనాడుకు శ్రీరామాయణ పారాయణం చేపట్టి చరిత్రను సృష్టించారు. భక్తులతో రామకోటి రాయించి  శ్రీరామ భక్తిని ప్రబంజనంలా చాటారు. ఆసేతు హిమాచలం నేపాల్‌ నుంచి కన్యాకుమారివరకు 108 ప్రదేశాలలో శ్రీ రామ స్థూపాలు ప్రతిష్టించారు.  శ్రీమాన్‌ టి.కె. గోపాలాచార్య స్వామి సంపాదకత్వంలో  శ్రీమన్నారాయణచార్య ఆధ్యాత్మిక మాస పత్రిక భక్తినివేదన 1947లో ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి కేంద్రాలయిన ఆలయాలపై దృష్టి సారించారు. భారతీయ దేవాలయాల పునరుద్ధరణకు  ముంబైలో 1974లో సంఘాన్ని  ప్రారంభించారు. ఇలా ఆలయాలకు పూర్వవైభవానికి ముందుకు వచ్చారు. ఇది ఇలా ఉంటే బద్రీనాథ్‌ వద్ద కోటి అష్టాక్షరి క్రతువు చేపట్టారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ చేసి మార్గదర్శకులైన పెద్ద జీయర్‌ స్వామి తరువాతి తరానికి చిన్న జీయర్‌ స్వామిని మనకు అనుగ్రహించి ధన్యులను చేశారు.
`వొద్దిపర్తి రామచందమ్రూర్తి

--
V.Ramachandra Murthy, 9963895914, USA 001 732 328 8552

1, ఆగస్టు 2019, గురువారం


16, జులై 2019, మంగళవారం

గురువే మార్గదర్శకుడు

గురువే మార్గదర్శకుడు
గురు ముఖంగా నేర్చుకుంటేకానీ వేద విద్య  ఒంట బట్టదు. నేర్చుకోవాలన్న తపన, జిజ్ఞ్యాస ఉన్నా సరైన సందర్భం అందరికీ కలిసిరాదు. శిష్యుల విషయం ప్రస్తావనకు వస్తే అందరూ  ఏకలవ్యుడిలా ఉండలేరు, నేటి పరిస్థితుల్లో నేర్చుకోవాలన్న తపన ఉండాలేకానీ కా వలసినన్ని పుస్తకాలు లభ్యం అవుతాయి. డిజిటల్ పుస్తకాలు కో కొల్లలు. పుస్తపఠనం మంచిదే కానీ అన్ని వేళలా అది కలిసిరాదు. కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్లు అన్ని పుస్తకాల్లోనే ఉంటాయి.  అన్నీ పుస్తకాల్లోనే ఉంటాయి. మంత్రం చెప్పాలన్నా పుస్తకం ముందు పెట్టుకుని చెప్పాల్సిందే. ఇలా అన్ని తెలిసినట్టే ఉంటుంది తెలియదు. వచ్చినట్టే అనిపిస్తుంది కాని రావు. అన్నీ సరిగా ఉండాలంటే సరైన మార్గదర్శకత్వం  కావాలి. అది గురువు ద్వారానే లభ్యం  అవుతుందనేది వాస్తవం.  గురువు ఎలా ఉండాలంటే...
శాంతోదాంతః కులీనశ్చ  వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహాను గ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు. ఇలాంటి గురువును ఆశ్రయించి. నిష్ఠతో నడుచుకుంటే కానీ సత్ఫలితాలు కనిపించవు

--
V.Ramachandra Murthy, 9963895914, USA 001 732 328 8552

2, జనవరి 2012, సోమవారం

మానవ వనరుకు మంచిరోజులు

వి.ఆర్.సి.మూర్తి, November 11th, 2011
ఐటి కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకువస్తున్నాయి. ఐటి రంగం మొత్తం సెక్యూరిటీ పరంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకువచ్చాయి. అయితే మరికొన్ని రంగాలలో లక్షలాది ఉద్యోగావకావాలు వచ్చే వీలుందని నాస్‌కామ్ చెబుతోంది. అంతే కాదు సిలికాన్ వ్యాలీలో మానవ వనరుల అవసరం పెరుగుతున్న విషయమై చర్చ సాగుతోంది. అమెరికా డాలర్ బలపడినా, లేక పరిస్థితి ఇలాగే కొనసాగినా కొత్త ఉద్యోగాలకు ఢోకా ఉండబోదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రోగ్రామర్స్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రోగ్రామర్స్, ప్రాజెక్ట్ లీడర్స్, సిస్టమ్స్ ఎనలిసిస్ట్, ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ డెవలపర్లు, వెబ్ డిజైనర్లు, వెబ్‌లో జావా ప్రోగ్రామర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి రంగంలో ప్రతి సాఫ్ట్‌వేర్ కార్యాలయ అవసరాలకు ఉపయోగించడానికి వీలుగా ఎప్పటికప్పుడు సరికొత్త టూల్స్ పుట్టుకువస్తున్నాయి. కేవలం అదే టూల్స్‌ను ఉపయోగించేవారికి కంప్యూటర్‌తో నిమిత్తం లేకుండా చిప్‌లో ప్రోగ్రామ్ నిక్షిప్తం చేసి సరికొత్త పెరిఫిరల్ ద్వారా వాటిని పనిచేయించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ రంగంలో కొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకువస్తున్నాయి. గత నెలాఖరులో బెంగుళూరులో జరిగిన ఐటి కంపెనీల ప్రతినిధుల సమావేశంలో కొత్తగా వస్తున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని మానవ వనరులను తీర్చిదద్దే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించినట్లు బోగట్టా. భవిష్యత్ అవసారాలను దృష్టిలో పెట్టుకుని కొత్త శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా వివిధ ఐటి కోర్సులను నిర్వహిస్తున్న శిక్షణాసంస్థలు ఉలుకుపలుకు లేకుండా ఉన్నాయి. గతంలో నిర్వహించినంత ప్రచార ఆర్భాటాలు లేవు. అయితే పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజినీరింగ్ విద్య పూర్తిచేస్తున్న విద్యార్థులలో అభ్యర్థులను మరింత ముందుగా ఎంపిక చేసి అవసరానికి అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేపనిని సిఎస్‌ఐ లాంటి స్వచ్ఛంధ సంస్థలను పురమాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన బయలుదేరింది. ఇప్పటికే మానవవనరులను తీర్చిదిద్దే దిశగా ఎన్‌ఎస్‌డిసి (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), పలు సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఈ సంస్థలలో పనిచేస్తున్న వివిధ కంపెనీ ఉద్యోగులు తమ కార్యాలయ అవసరాలు తీరిన తరువాత తీరికవేళల్లో శిక్షణ కార్యాక్రమాల వైపు దృష్టి సారిస్తున్నారు. గతంలో ప్రధాన కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలా ప్రైవేట్ శిక్షణ సెమినార్స్‌లో పాలుపంచుకునే విషయంలో ఆంక్షలు కొంతవరకు ఉండేవి. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని మానవ వనరులను తీర్చిదిద్దే దిశగా అనుభవజ్ఞులైన ఉద్యోగులకు, నిపుణులకు కాస్త వెసులుబాటు ఇచ్చే దిశగా వివిధ ఐటి కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. ఎన్‌ఎస్‌డిసి (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఐటి రంగంలో ఉద్యోగాలు ఊహకు అందని విధంగా పెరుగుతాయని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికలను వెబ్‌లో ప్రచురించింది. ఏ రంగాలలో నిపుణుల అవసరం పెరుగుతుందో తెలిపే విధంగా నివేదికలో పొందుపరిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వీలుగా http:// www.nsdcindia.org/knowledge-bank/index.aspx వెభ్‌సైటులో సమాచారం ఉంచింది. ఇందులో మాడూళ్లుగా వివిధ విభాగాలకు చెందిన సమాచారం పిడిఎఫ్‌లలో ఉంచింది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం కూడా ఐటి రంగంలో నిపుణుల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టే పనులను ఎన్‌ఎస్‌డిసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు పురమాయించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ, కార్మిక శాఖ ఇందులో కీలక భూమికను పోషించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 12 మిలియన్ల మందిక ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇది మరింతగా 8 నుంచి 10 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డిహెచ్‌ఐ ( డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్) ఎన్‌ఎస్‌డిఎస్‌లు సంయుక్తంగా కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టాయి.

౨౦౧౧ టెక్నాలజీ తీపిగుర్తులు


టెక్నాలజీ తీపిగుర్తులు.విండో
-వి.ఆర్.సి.మూర్తి, December 30th, 2011
ఎన్నో ఆవిష్కరణలు, సంస్కరణలు మోసుకుంటూ వెళుతున్న 2011 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతుంటే, కొత్త ఆవిష్కణలతో 2012 ముస్తాబు అవడానికి సిద్దం అవుతోంది. టెక్నాలజీకి వనె్న తెచ్చినవారు, రూపురేఖలు మార్చినవారిలో కొందరు కాలచక్రంలో కలిసిపోయారు. కొన్నిదేశాలలో ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణ, నిషేధాలు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. చైనా, పాకిస్తాన్, కొన్ని అరబ్‌దేశాలలో సామాజిక నెట్‌వర్క్‌పై నిషేధాజ్ఞల ఉక్కుపాదం మోపిన ఉదంతాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణకు వేదిక అయిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకులలో ఒకరైన స్టీవ్‌జాబ్ ఈ సంవత్సరమే కన్నుమూసారు. ఇది ఇలా ఉంటే యూరోపియన్ యూనియన్‌లో ఉన్న కేసులలో ఆపిల్ విజయం సాధించింది. కొత్త ఆవిష్కరణలో మొబైల్ రంగందే పైచేయిగా ఉంది. కార్యాలనిర్వహణ అంతా మొబైల్ రంగం సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇఆర్‌పి ప్యాకేజీలు సైతం మొబైల్‌లో ఉపయోగించుకునేలా సరికొత్త ప్యాకేజీలు వచ్చాయి. జావాను సొంతం చేసుకున్న ఒరాకిల్ మరింతగా విస్తరించి ఏ ప్లాట్‌ఫారంలోనైనా పనిచేయడానికి రూపుదిద్దుకుంది. కంప్యూటర్, మోబైల్ రంగాల పరికరాలకు పనితీరుకు జావా అప్లికేషన్లు మరింతగా వనె్నతెస్తున్నాయి. ఐన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తీరుతెన్నులు తెలిపే గోష్ఠులు ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. దేశంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పల్లెబాట పట్టేలా మొబైల్ ఇంటర్‌నెట్ ప్యాకేజీలు ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. గతం సంవత్సరంతో పోలిస్తే ఇంటర్‌నెట్ యూజర్ల సంఖ్య 30 శాతం పైగా పెరిగింది. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఇంటర్‌నెట్ ద్వారా లబ్ధిపొందుతున్నవారే ఉన్నారు. ఆర్థిక మాంధ్యం వల్లనైతేనేమి ఇతర కారణాలవల్లనైతేనేమి కంప్యూటర్ ధరలు పెరుగుతున్నాయి. అలాగే పెరిఫిరల్స్ కూడా పరుగులు పెడుతున్నాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ మాట ఎలా ఉన్నా విండోస్ 7లో, ఆండ్రాయిడ్, క్లౌడ్‌లో ఎన్నో కొత్త టూల్స్ వచ్చాయి.
సామాజిక నెట్‌వర్క్‌లో పారదర్శకత పాటించాలని చెపుతూ వస్తున్న భారత ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి సిద్ధ్దపడింది. ఏది ఏమైతేనేం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న, మత వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ కోర్డు డిసెంబర్ నాలుగోవారంలో తీర్పునిచ్చింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కొన్ని దేశాలలో సామాజిక వేదికలపై నిషేధం కొనసాగుతోంది. ఫేస్‌బుక్‌ను చైనా, పాకిస్తాన్, ఇరాన్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిషేధించగా, యూ టూబ్‌ను టర్కీ, థాయ్‌లాండ్, పాకిస్తాన్, చైనా ఇండోనేషియా నిషేధించాయి. అదేవిధంగా ట్విట్టర్‌ను చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బాగర్‌ను ఇథాయోపియా, పాకిస్తాన్, చైనా నిషేధించాయి. వాస్తవాలను తెలియజెప్పుతూ. ఆధారాల దొంతరలతో చరిత్రపుటలు ఆవిష్కరిస్తున్న వికీపిడియాను చైనా, ఇరాన్, పాకిస్తాన్ నిషేధించాయి. సామాజిక నెట్‌వర్క్‌సైట్లపై కొన్ని దేశాలు పాక్షికంగా ఆంక్షలు విధించాయి. వాస్తవానికి వస్తే సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లు నిర్వహణతీరు పారదర్శకంగా ఉండాలన్న వాదనకు బలం చేకూరింది. ప్రాంతీయ భాషలను ఇంటర్‌నెట్‌లో ఉపయోగిస్తున్న దేశాలలో ఇ-పనులు చేపట్టడానికి నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువ మొత్తంలో వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా లేని దేశాలలో మొదటికే మోసం వస్తోంది.
అభివృద్ధి విషయానికి వస్తే అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి క్రమంగా భారత్ కోలుకుంది. అయితే ఉద్యోగాల కల్పనలో వివిధ కంపెనీలు ముందడుగు వేస్తున్న తరుణంలో రూపాయి క్షీణించడం, డాలర్ విలువ పెరుగడంవల్ల ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు సంతోషించాలో బాధపడాలో తెలియక సతమతం అవుతున్నాయి. మానవ వనరుల అవసరం నానాటికీ పెరుగుతోందని ఇటు నాస్‌కామ్, నాస్‌డాక్, డిపార్ట్‌మెంట్‌ఆఫ్ ఎలక్ట్రానిక్ చెబుతున్నాయి. అయితే ఐటి కెరీర్‌లో ఉన్న నిపుల జీత భత్యాల పెరుగుదలకు బ్రేక్‌పడింది. ఈనేపధ్యంలోనే ప్రముఖ ఐటి సంస్థలు విద్యాసంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకోడానికి ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇన్ఫోటెక్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతొ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా పలు ఇంజనీరింగ్ కళాశాలలతో చాలా ఐటి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా క్యాంపస్ ఇంటర్వ్యూలకు ఐటి కంపెనీలను స్వాగతిస్తున్నాయి.
నెట్‌పైయువత చేస్తున్న పరిశోధనలకు గుర్తింపు లభిస్తోంది. యువత సామాజిక నెట్‌వర్క్‌ల వేదికలపై తమ అభిరుచులను పంచుకోవడమేకాదు తమ ఆలోచనలు తెలుపడానికి అనువుగా మలుచుకుని గుర్తింపును తెచ్చుకుంటుంన్నారు. కొందరు పాఠ్యాంశాలపై పరిశోధనలు చేస్తుంటే, మరికొందరు తమకు ప్రవేశం ఉన్న కళలను ప్రదర్శించడానికి ఉపయోగించుకున్నారు. విండోస్ 7 ఒఎస్‌తో నోకియా ఫోన్, క్లౌడ్‌తో ఐ-్ఫన్, ఐ-ప్యాడ్, ఆండ్రాయిడ్‌తో సరికొత్త స్మాట్ ఫోన్లు సంవత్సరం చివరి త్రైమాసికంలో వరుసగా వచ్చాయి. సాఫ్ట్‌వేర్ టూల్స్ విషయానికి వస్తే స్మాట్ టూల్స్ కొత్తగా కుప్పతెప్పలు వచ్చిపడుతున్నాయి. ఇంటర్‌నెట్ ఆధారంగా పనిచేసే వీటిని స్మాట్ పరికరాలలో ఇన్‌స్టాల్ చేసుకోవడంలో ఒక రకంగా యూజర్‌కు ప్రయోజనం ఎలా కలుగుతుందో, వాటి ద్వారా సంక్రమిస్తున్న ప్రకటనల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఫ్లాపీలైతే ఇప్పటికే అంతరించాయి. సిడిల టెక్నాలజీ కూడా ఈ సంవత్సరంతో కనుమరుగు అవుతుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. చౌకగా ఆకాష్ ఆవిష్కరణ భారత నిపుణుల తీరు శ్లాఘించేలా చేసింది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కంప్యూటర్లలో సిడి డ్రైవ్‌లు కనిపించడంలేదు. సామాజికనెట్‌వర్క్ జాబితాలోకి గూగుల్ ప్లస్ చేరింది. కొత్త సంవత్సరంలో గూగుల్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఉత్పత్తులు, మినీ ఐ-పాడ్, అల్ట్రాబుక్స్, మ్యాక్ బుక్‌ఎయిర్, ఆపిల్ టివి, కిండిల్ ఫైర్ 2, ఆపిల్ ఐటివి, ఐపాడ్ 3, ప్లేస్టేషన్ విస్టా, నోక్ ట్యాబ్‌లెట్ 2, 32 మెగా పిక్సల్ కెమారా నికాన్ 800, కెనాన్ 5డి మార్క్ త్రి, విండోస్ -8 ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్నాయి. పాస్‌వర్డ్‌లలో నూతన శకం ప్రారంభం అయింది. వాయిస్ టెక్నాలజీకి ప్రారంభించిన నేపధ్యంలో బయో మెట్రిక్ పాస్‌వర్డ్ టచ్‌స్క్రీన్ ఐపాడ్, నోట్‌బుక్‌లలో ఇలా పనిచేస్తుందని న్యూయార్క్ యూనివర్శిటీ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెస్ నాసినర్ మెమూన్ ప్రకటించారు. దీనివల్ల టచ్‌స్క్రీన్‌పై చేతిరాతతో పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవచ్చని, ఐ-పాడ్‌లలో ఐదు మునివేళ్లతో నిమిరి పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేయవచ్చని ఆయన వివరించారు. ఇలాంటి పాస్‌వర్డ్ ద్వారా ఆయా పరికరాల పనితీరుకు లాగిన్ కావచ్చని వివరించారు. కొన్ని సందర్భాలలో డిమాండ్ సరిపడా వస్తుంవులు లభించే అవకాశం ఉండదు. ఈ నెల బ్లాక్ ఫ్రైడే సందర్భంగా వినియోగదారులు బుక్ చేసిన వస్తువులు సరఫరా చేయలేక బెస్ట్ బై చేతులు ఎత్తేసింది. దీనితో కోర్టు వ్యాజ్యాలను అది ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రముఖ ఐటి కంపెనీలు సాఫ్ట్‌వేర్ ప్రయోజనాల విషయంలో కొన్నిదేశాలలో వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు ఎక్కువ ఆవిష్కరణలు అందించి రికార్డును సృష్టించారు. అదేవిధంగా దేశంలో కాన్పూర్ ఐఐటి, చెన్నై ఐఐటిల విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేసిన ప్రాజెక్టులు కొత్త ఆవిష్కరణలకు బాటలు వేశాయి.

26, ఆగస్టు 2010, గురువారం

రూపాయికి రూపం

రూపాయికి రూపం
రూపాయికి రూపం వచ్చింది. అన్ని కరెన్సీలకు గుర్తులు ఉన్నప్పుడు భారతదేశం రూపాయికి గుర్తింపు ఎందుకు ఉండకూడదూ? ఈ ఆలోచన ఇటీవల రావడంతో దానికి ఒక రూపం ఇచ్చారు. ఈ రూపానికి అధికారికంగా ఆమోదం లభించిన వెంటనే అన్ని కంప్యూటర్ల కీబోర్డులోకి డాలర్ వచ్చినట్లే రూపాయికూడా తీసుకురావడానికి బెంగుళూరుకు చెందిన ఫారడిన్ టెక్నాలజీస్ సంస్థ తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో భాగంగా టిటిఎఫ్ (ట్రూ టైప్ ఫాంట్)ను రూపొందించింది. దీనికి Rupee Foradianగా నామకరణం చేసింది. సాధారణంగా అన్నిరకాల డెస్క్‌టాప్ అప్లిషన్లలో దీనిని అందించే ప్రయత్నం చేసింది. ముందుగా ఈ ఫాంట్‌ను సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 7 లేదా అంతకుముందు వచ్చిన విస్టాలో అయితే రన్ చేసి ఇన్‌స్టాల్ అంటే సరిపోతుంది. విండోస్ ఎక్స్‌పివరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను సి ప్రామ్ట్‌లో విండోస్/ ఫాంట్ ఫోల్డర్‌లో కాపీ చేస్తే చాలు. ఆవెంటనే ఒక మారు సిస్టమ్స్‌ను రీ స్టార్ట్ చేసే వెంటనే రూపాయి ఫాంట్ అందుబాటులోకి వస్తుంది. ఇది కీ బోర్డులో ఎక్కడ ఉంటుందో వెదుక్కోనక్కర లేకుండా కూడా సెలక్ట్ చేసిన కీలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కాస్త శ్రమతో కూడిన వ్యవహారం కనుక ఆల్ట్ కీ పట్టుకు '0096' టైప్ చేస్తే చాలు కావాల్సిన కీలో ఈ ఫాంట్ కనిపిస్తుంది. అలా కాకుండా Rupee Fofradian ఫాంట్‌ను సెలక్ట్‌చేసి టాబ్ పైన ఉన్న కీని టైప్ చేస్తే చాలు రూపాయి గుర్తు కనిపిస్తుంది. మీరు కూడా మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫారడిన్ టెక్నాలజీ సైట్‌ను ఒకమారు సందర్శించండి. ఇమేజ్‌లను ఫాంట్‌లుగా మార్చుకునే సాఫ్ట్‌వేర్స్ ఎన్నో ఉన్నాయి. కావాల్సిన అక్షర కావాల్సిన ప్రదేశంలో కనిపించాలన్న లక్ష్యంతో గ్రాఫికల్ సాఫ్ట్‌వేర్స్ ఎన్నో వచ్చాయి. ముందుగా కావాల్సిన ఇమేజ్‌ను ఎంపిక చేసి దానిని ఫాంట్‌గా తయారు చేయడాని సదరు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రన్ చేస్తే కావాల్సిన ఫాంట్ కావాల్సిన విధంగా తయారువుతుంది. దానికి కూడా ముందు ఫాంట్ పేరు చివర సదరు ఫాంట్‌ను రూపొందించడానికి ఉపయోగించిన అప్లికేషన్ పేరుతో టిటిఎఫ్ ఫాంట్ రూపొందుతుంది.

17, జులై 2010, శనివారం

సైబర్ క్రిమినల్ ఆటకట్టు

సైబర్ క్రిమినల్ ఆటకట్టించేందుకు ఎర వేశారు. ఈ ఎరను హనీపాట్‌గా వ్యవహరిస్తున్నారు. ట్వీట్టర్‌లో సాధరణ సభ్యత్వం తీసుకున్న కొంతమంది నిపుణులు సైబర్‌నేరగాళ్ల ఆటకట్టించేందుకు వీలుగా 61 హనీపాట్స్ పోస్ట్ చేశారు. ఈ హనీపాట్స్‌కు 30,867 మంది స్పామర్లు చిక్కారు. ఇలా స్పామర్ల ఆటకట్టించేందుకు టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థులు పరిశోధకులు కొత్త పరిశోధనకు నాంది పలికారు. వీరు ముందుగా ట్వీట్టర్‌ను వేదిక చేసుకున్నారు. ఆతర్వాత ఇతర సామాజిక వెబ్‌సైట్లను వేదిక చేసుకుని సైబర్‌నేరగాళ్ల ఆటకట్టించే యత్నంలో టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థులు, శాస్తవ్రేత్తలు నడుంబిగించారు.
చైనాలో బ్లాక్ హాక్ సేప్టీనెట్
బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ అంటే ఇదో కంపెనీ అనుకుంటే పొరపాటు. సైబర్‌నేరగాళ్లను తయారు చేసే కేంద్రం. హ్యాక్ చేయడం ఎలా అన్న అంశంలో శిక్షణ నిస్తున్న ఈ బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ రహస్యంగా నిర్వహిస్తున్న సంస్థ. ఈ సంస్థ తీరు తెన్నులు గత సంవత్సరం చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ సంస్థను రహస్యంగా నిర్వహిస్తున్నారని. కంప్యూటర్ నిపుణులకు, విద్యావంతులకు హ్యాక్ చేయడంలో శిక్షణ నిస్తున్నారన్న విషయం చైనా నేరపరిశోధన సంస్థ దృష్టికి వచ్చింది. ఈ సంస్థలో శిక్షణపొందిన వ్యక్తి ఒకరిని అదుపులో తీసుకున్నప్పుడు ఈవిషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అప్పట్లో చైనా గోప్యంగా ఉంచింది. ఎందుకంటే చైనాప్రభుత్వానికి చెందిన విలువైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లలో తొంగిచూశారని ఆరోపిస్తూ దీనికి గుగూల్ సర్చ్ ఇంజన్ సహకరిస్తుందని ఆరోపణ చేస్తున్న రోజులు అవి. అందుకే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే అప్పట్లో చైనా నుంచే సైట్లు హాక్ చేస్తున్నారంటూ అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ గగ్గోలు పెట్టింది. ఏది ఏమైనా బ్లాక్ హాక్ సెఫ్టీనెట్ వ్యవహారం గుట్టు రట్టు అయింది. ఇందులో శిక్షణ పొందిన వారు ఎలాంటి ఫైర్‌వాల్ ఏర్పాటు చేసినా నెట్‌వర్క్‌లోని కంప్యూటర్లను హాక్ చేయగలరని తెలుస్తోంది. వీరి ముందు చైనా గ్రేట్ ఫైర్‌వాల్ సైతం దిగదుడిపే అన్నమాట.

ఆన్‌లైన్ సంగీతం షేరింగ్ కేసులో మలుపు

ఇంటర్‌నెట్‌లో సంగీతం (పాటల) షేరింగ్ కేసు మలుపు తిరిగింది. ప్రముఖ కంపెనీకి చెందిన 30 పాటలను ఆన్‌లైన్‌లో షేరింగ్ చేసిన బాస్టన్ యూనివర్శిటీ విద్యార్థికి విధించిన భారీ జరిమానా చెల్లించ కుండా ఫెడరల్ జడ్జి మినహాయింపు నిచ్చారు. లాభాపేక్షలేకుండా, ఏలాంటి ఆదాయంలేకుండా 30 పాటలను ఆన్‌లైన్‌లో షేరింగ్ ఇచ్చిన విషయాన్ని గమనించిన నేపధ్యంలో కేసు ప్రాథమిక విచారణలో కోర్టు విధించిన జరిమానాకు మినహాయింపు లభించింది. అయితే కాపీ రైట్ చట్టం కింద జరిగిన పొరపాటు క్షమించరానిదని అన్నారు. పీర్ - పీర్ నెట్‌వర్క్ ద్వారా షేరింగ్ చేస్తున్నవారికి కేసు విచారణ గుబులు పుట్టిస్తోంది. విద్యార్థులు ఆకతాయిగా ఇంటర్‌నెట్‌లో చేసిన పనిని కఠినంగా వ్యవహరించవద్దని చేస్తున్న నేపధ్యంలో కేసు మలుపులు తిరిగే అవకాశం ఉంది. పైరసీని నిరోధించే క్రమంలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టే క్రమంలో కేసు విచారణ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇలాంటి కేసు గతంలో విచారణ జరిగిన సమయంలో 24 పాటలను షేరింగ్ చేసిన సమయంలో కూడా జడ్జి విధించిన జరిమానా చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. ఏది ఏమైనా ఆన్‌లైన్‌లో పీర్ - పీర్ నెట్‌వర్క్ ద్వారా సినిమాలు, సంగీతం, వీడియోలు, పుస్తకాలు, సాఫ్ట్‌వేర్స్ షేరింగ్ చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇలా పీర్ టూ పీర్ నెట్‌వర్క్‌లో షేరింగ్ చేస్తున్న వారికి ఏ కేసు ఎప్పుడు ఎదురవుతుందో అనే భయం పట్టుకుంటోంది. ఇది ఒక వ్యవస్థలో సభ్యత్వం తీసుకున్నవారి మధ్యనే డేటా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది. అలాంటప్పుడు వ్యవస్థ నిర్వహించే విధానాన్ని ఎందుకు తప్పుపట్టకూడదన్న వాదన కూడా బయలు దేరుతోంది. ఇదే చర్చకు వస్తే వివిధ సందర్భాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తప్పు పట్టాల్సి వస్తుంది. అలాంటపప్పుడు పీర్ టూ పీర్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్న ప్రయోజనాలు దెబ్బతింటాయి. కనుక ఈ విషయంలో తగు వెసులు బాటు చూపాలన్న వాదన కూడా వినపడుతోంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో పుస్తకాలు, విజ్ఞాన సంబంధించిన అంశాలు లైబ్రరీద్వారా ఆన్‌లైన్‌లోని ఒకే గ్రూపు విద్యార్థుల మధ్య డేటా ఇచ్చిపుచ్చుకునే విధానానికి ఆంక్షల ఉచ్చు బిగుసుకున్నట్లే అన్న వాదన బయలు దేరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు డేటాషేరింగ్ విషయాన్ని పక్కనపెడితే ఆన్‌లైన్‌లో విలువైన సంగీతం పైరసీకి తావుఇవ్వడం తప్పేకనుక ఈ విషయంలో మినహాయింపులు ఉండకూడదన్న వాదన తమకు నష్టం జరిగిందన్న కంపెనీలు వాదిస్తున్నాయి.

16, జులై 2010, శుక్రవారం

మళ్లీ చైనాలో గూగుల్ సర్చ్

ఎట్టకేలకు గూగుల్ విజయం సాధించింది. చైనాలో గూగుల్ వెబ్‌సైట్ నిర్వహణకు ప్రభుత్వ అనుమతిని సంపాదించగలిగింది. చైనాలో గూగుల్ సర్చ్ వెబ్‌సైట్‌పై ఆంక్షలు వెలువడినా ఇతర విషయాలలో తన సేవలు అందించడానికి వెనుకాడలేదు. ముఖ్యంగా ప్రాంతీయ భాషావెబ్‌సైట్ల నిర్వహణకు తోడ్పడుతూ వస్తోంది. అత్యధిక వెబ్ యూజర్లు ఉన్న చైనాలో ఎక్కువ మంది గూగుల్ డాట్ సిఎన్ సైటుపైనే మోజుపెట్టుకున్నారు. వెబ్‌లో ఏ సమాచారం కావాలన్నా సదరు సైటులోకి వెళ్ళి శోధించేవారే. చైనా ప్రజలే కాదు, అక్కడి అధికారులుసైతం గూగుల్ అభిమానులే. ఇంతమంది అభిమానం చూరగొన్న గూగుల్ మాత్రం నిషేధకాలంలో తన సేవలు వెనక్కు తీసుకోలేదు. ఎక్కువ ఎదురుగాలి వీచడంవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలా ఉంటే ప్రత్యర్థులు సైతం ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతుండటం చూస్తూ ఉండిపోయింది. ఈ నిషేధ సమయంలో చైనా సర్చ్ ఇంజన్ బైదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, వెబ్ ఆధారిత ల్యాబ్ నిర్వహించడంలో గూగుల్ ముందుంది. ఈ క్రమంలోనే గూగుల్ డాట్ సిఎన్ సర్చ్ సైటు మూత పడలేదు. సింగపూర్ కేంద్రంగా గూగుల్ సైటు నిర్వహణ సాగింది. కానీ చైనా ఆంక్షల నేపధ్యంలో తూచి తూచి అడుగు వేసింది. ఈ క్రమంలో చైనాలో గూగుల్ మళ్లీ అడుగుపెట్టడం జరుగుతుందా అన్న ఆలోచన బయలు దేరింది. ఈ క్రమంలోనే గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆండరాయిడ్ మొబల్స్ విడుదల కాలేదు. దీనికి తోడు మోటరోలా లాంటి ఇంతర కంపెనీలు సైతం తమ మొబైల్స్‌లో బైదూ సర్చ్‌కు ప్రాధాన్యత కల్పించారు. ఏది ఏమైనా తిరిగి గూగుల్ వెబ్‌పేజీ ప్రారంభానికి చైనాలో అనుమతి లభించడంతో క్రమంగా పూర్వవైభవం కలిగే అవకాశం ఉంది. అయితే గూగుల్ ఇప్పటికైనా సర్చ్ విషయంలో ఆచి తూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా అశ్లీల ప్రొనో సైట్లు, చైనా ప్రభుత్వ వ్యతిరేక వెబ్‌పేజీలు సర్చ్‌లో కనిపించకుండా జాగ్రత్త పడితే కాని మళ్లీ నిలదొక్కుకోలేదు. ప్రపంచంలో అత్యధిక వెబ్‌యూజర్లు ఉన్న చైనాలో గూగుల్ తన స్థానాన్ని నిలుపుకునేందుకు బైదుకు పొటీగా నిలపడకతప్పదు.

9, జులై 2010, శుక్రవారం

మనసులో మాటకు ‘వేదిక’


మనసులో మాట చెప్పుకోడానికి వెలుస్తున్న సోషల్‌నెట్‌వర్క్ సైట్లు దిదిన ప్రవర్ధమానం అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తమ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దేంకు వివిధ వెబ్‌సైట్లు కృషి చేస్తున్నాయి. సోషల్‌నెట్‌వర్క్ సర్వీసులను అందించే వెబ్‌సైట్లలో చాలా కాలంగా ఎన్నో వెలుస్తున్నా అత్యంత ఆదరణ చూరగొన్నదిగా ఫేస్‌బుక్‌కు గుర్తింపు వచ్చింది. చాలా మందికి తెలిసిన ఫేస్‌బుక్, ఆర్కుట్, ట్విట్టర్, మైస్పేస్, లింక్‌డిన్ తమ తమ వాటాదారులను సంపాదించుకుంటున్నాయి. సోషల్‌నెట్‌వర్క్‌లో అన్నింటికన్నా ఫేస్‌బుక్ వినియోగదారుల మన్ననలు అందుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఆర్కుట్‌వైపు మొగ్గు చూపేవారు క్రమంగా వారు ఫేస్‌బుక్‌వైపు తమ చూపులు మరలుస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ నెట్‌వర్క్ అందిస్తున్న వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్, మై స్పేస్, ట్విట్టర్, లింక్‌డిన్, నింగ్, టాగ్, క్లాసమేట్స్, హి 5, మై ఇయర్‌బుక్, మీట్ ఆప్, బీబో, మై లైఫ్, ఫ్రెండ్స్‌టర్, మైహెరిటేజ్, మల్టీఫ్లై, ఆర్కుట్, బాదో, గయా ఆన్‌లైన్, బాక్ ప్లానెట్ స్కైరాక్ తదితరాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించుకోడానికి ఏర్పాటు చేసిన వెబ్‌పేజీ ప్రాథమిక నమూనానే క్రమంగా సోషల్‌నెట్‌వర్క్ ఏర్పాటుకు మూలం అయింది. ఈ సంవత్సరం ప్రథమార్థానికి సుమారు 25 కోట్ల మంది వినియోగదారులు ప్రతినెల తమ సైటును సందర్శిస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా మైస్పేస్‌ను 12 కోట్ల 20 లక్షల మంది, ట్విట్టర్‌ను ఎనిమిది కోట్ల ఐదు లక్షల మంది, లింక్‌టిన్ ఐదుకోట్ల మంది, ఆర్కుట్‌ను 4కోట్ల 50లక్షల మంది ప్రతినెలా తమ సైటును సందర్శిస్తున్నవారిలో ఉన్నారు. ఎప్పటిక్పుడు వినియోగదారులు తాము ఏర్పాటు చేసుకున్న సోషల్‌నెట్‌వర్క్‌లోని సైటను నెలలో ఎన్నిమార్లు సందిర్శిస్తున్నారన్న ప్రాతిపదికపై సర్వే నిర్వహించారు. హిట్టింగ్‌రేట్‌కు అనుగుణంగా ఫేస్‌బుక్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంతమంది వినియోగదారులు ఉన్నారని కాదు. ఎంతమంది వినియోగదారులు సమర్థవంతంగా సైటును ఉపయోగించగలుగుతున్నారన్న ప్రాతిపదికపేనే సోషల్‌నెట్‌వర్క్ మనుగడ ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా కొత్తగా ఇమెయిల్ ఐడి (వెబ్‌చిరునామా) ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆయా చిరుమానామా నమోదు చేసిన సైటుకు సంబంధించి సోషల్‌నెట్‌వర్క్ ఖాతా పై మీకు మక్కువ ఉందా? ఉంటే ప్రారంభించండి అంటూ సందేశం కనిపిస్తుంది. ఆదిలో తమకంటూ సోషల్‌నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా సదరు సైటులో ఇప్పటికే నమోదు అయినవారు పరిచయం చేస్తేకానీ సోషల్‌నెట్‌వర్క్‌లోకి సభ్యత్వ లభించేది కాదు. భారదేశంలోని ఎక్కువ మంది వినియోగదారలు ఆర్కుట్‌పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అది ఇప్పుడు క్రమంగా ఫేస్‌బుక్‌వైపు వారి చూపులు మరలాయి. సోషల్‌నెట్‌వర్క్ సైట్లు వివాదం అయిన తరువాతనే ప్రచారంలోకి వచ్చాయి. ఆర్కుట్‌లో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సైటులో తొంగి చూసి స్నేహం చేయడంవల్ల తొలుత ప్రచారం చోటు చేసుకుంది. ఆర్కుట్‌లో స్నేహం చేసినవారిలో ఎక్కువ మంది యువతీ యువకులు వివాహాల వరకు వెళ్ళిన వారు ఉన్నారు. వివాదాలు కొనితెచ్చుకున్నవారు ఉన్నారు. దాపరికంలేకుండా మనసులో మాటచెప్పడమేకాదు కళ్లకు కట్టిట్టు చూపడంవల్ల ఫేస్‌బుక్ ఎక్కువ ఆదరణ చూరగొన్నది. ప్రముఖులు ఫేస్‌బుక్‌లో వెల్లడించిన తమ జీవితరహస్యాల వల్ల ఎందరో వివాదాల పాలు అయిన సందర్భాలు ఉన్నాయి. మనసులో మాట చెప్పాంటే ఇది వేదిక అయింది. ఈ వేదిక మీద చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తాయి. ఆత్మీయుల గుండెతలుపులను తడుతాయి. సోషల్‌నెట్‌వర్క్‌లో చాలా మంది ఖాతా తెరుస్తారు కానీ, అప్‌డేట్ చేయడానికి ముందుకు రారు. ఇలా నిరర్థంగా ఉన్న సోషల్‌నెట్‌వర్క్ చిరునామాలు ఒక్కో సైటులో 60 శాతంపైగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఫేస్‌బుక్, ఆర్కుట్ సోషల్‌నెట్‌వర్క్‌పైన ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అసలు ఈ సైట్లవైపు వినియోగదారులు ఎందుకు మక్కువచూపుతున్నారో పరిశీలిస్తే సులభంగా వెబ్‌పేజీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అన్ని విషయాలు అప్‌డేట్ చేయడంవరకు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో సైటు డిజైన్, వేగం, రిలవెన్సీ, కొత్త అప్లికేషన్లు, స్నేహితులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఫొటోలు, వీడియోలు, నోటిఫికేషన్లు, చాట్ తదితరాలుకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాధాన్యత ఇచ్చేక్రమంలో ప్రాంతీయ భాషలో వినియోగదారుడు తమ అభిప్రాయం చెప్పగలగడం అగ్రస్థానాన నిలుస్తుంది.

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఐటి కెరీర్‌కు ఇక ఢోకా లేదు

ఐటి కెరీర్‌కు ఇక ఢోకా లేదు

భారత దేశంలో ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల నియామకాలకు గత రెండు నెలల క్రితమే వివిధ కంపెనీలు శ్రీకారం చుట్టగా ఈ సంవత్సరంలో సుమారు 50వేల మందిని మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించే దశలో ప్రధాన ఐటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం మళ్లీ క్యాంపస్ ఇంటర్య్వూల పేర తమ ద్వారాలు తెరిచాయి. ఈ నేపధ్యంలో ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో తదితర కంపెనీలు కళాశాలలో క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించే దిశగా పను ప్రారంభించినట్లు భోగట్టా. ఐటి రంగంలో మానవ వనరులను ప్రోత్సహించి వారికి ప్రయోజనాలు అందించే దిశలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందుగా శిక్షణ నిచ్చే పనులను ప్రారంభించింది. క్యాంపస్ ఇంటర్య్వూలలో వివిధ కంపెనీలకు సిఎస్‌ఐ చేదోడుగా ఉంటున్న విషయం విధితమే. ఇది ఇలా ఉండగా వచ్చే మూడు నెలలలోటిసిఎస్ సుమారు 30 వేల మందిని ఉద్యోగాలలో తీసుకోనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. 30 వేల మందిలో కొత్తవారికి 70 శాతం వరకు అవకాశం కల్పిస్తామని అదే విధంగా అనుభవం ఉన్న వారిని 30 శాతం వరకు ఎంపిక చేస్తామి కూడా టిసిఎస్ తెలుపుతోంది. ఇది ఇలా ఉంటే కొత్తవారి ఎంపిక కంటే గత సంవత్సరంగా ఖాళీ ఉన్న వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే దిశలో ప్రముఖ కంపెనీలు ముందుకు వెళుతున్నాయి. అయితే పట్టాతీసుకున్న తరువాత గడిపిన కాలంలో వారు ఏమి చేశారనే విషయంపైననే వౌఖిక ఇంటర్వ్యూలలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కెరీర్‌కు చాలా కాలంగా దూరం ఉన్నవారు నడుచుకున్న నడవడికపైన వారి ఆలోచన, తీరు తెన్నులు ఆధారపడుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. విప్రోసుమారు పదివేల మందికి అవకాశం కల్పించ నుండగా, మైక్రోసాఫ్ట్ ఒకడుగు ముందుకు వేసి హైదరాబాద్ క్యాంపస్‌లోని సుమారు 15 వేల మంది మానవవనరులకు అవకాశం కల్పించనున్నది. అంతే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల తగు ప్రాధాన్యత కల్పిచడానికి వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కేవలం ఈ పురోభివృద్ధి సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాలేదు. హార్డ్ వేర్ రంగంలో నిపుణులకు అవకాశాలు గుమ్మం తడుతున్నాయి. హెచ్‌సిఎల్, రాక్‌వెల్ కలిన్స్, జియోమెట్రిక్, సీమెన్స్, హనీవెల్, టాటా, టెక్ మహీంద్రా, హెగ్జావేర్ టెక్నాలజీస్ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించ నున్నట్లు ఆయా వెబ్‌సైట్లలో తెలుపుతున్నాయి. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వివరాలు క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించనున్న కళాశాలలకు పంపినట్లు భోగట్టా. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి పరిశ్రమల పురోగతి అధికంగా ఉంటుందని, దేశీయంగా 17 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశం ఉందని నాస్‌కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వెల్లడించారు. అవుట్‌సోర్సింగ్‌పై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని దేశీయ ఐటి కంపెనీలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా ఇప్పడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మరింత మెరగుపడుతుందని నాస్‌కామ్ చైర్మన్ ప్రమోద్ భాసిన్ చెప్పారు. దేశంలో ఐటి రంగంలో జరుగుతున్న అభివృద్ధిని నాస్‌కామ్ గమనిస్తోందని, వచ్చే ఆరునెలలో అవుట్‌సోర్సింగ్ రంగం పురోగతి సాధిస్తుందని నాస్‌కామ్ వెల్లడించింది.

క్రేజీ బ్రౌజర్ సరికొత్త వర్షన్

క్రేజీ బ్రౌజర్ సరికొత్త వర్షన్

ఇంటర్‌నెట్‌లో వేగంగా దూసుకు వెళ్లడానికి వీలుగా క్రేజీ బ్రౌజర్ నడుం బిగించింది. కేవలం వారం రోజుల వ్యవధిలో వినియోగదారుల ప్రయోజనాలకోసం సరికొత్త వర్షను విడుదల చేసింది. అత్యాధునిక సదుపాయాలతో క్రేజీ బ్రౌజర్ 3.03 వర్షన్ ఫిబ్రవరి 12న విడుదల అయింది. మారుతున్న టెక్నాలజీకి దర్పణం పట్టేవిధంగా ఇందులో ప్లగ్గిన్స్ జోడించారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తగా సుమారు 56 బాషలను సపోర్టు చేసే విధంగా సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా భారతీయ సపోర్టు చేయడం ప్రత్యేక ఆకర్షణ. కేవలం 0.7 ఎంబి ఫైలుతో బ్రౌజర్ రన్ అవుతుంది. సాధారణంగా అందుబాటులోకి వచ్చిన ఇతర బ్రౌజర్లతో పోలిస్తే అతి చిన్న బ్రౌజర్ ఇదే. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరల్‌లో ఉన్న సదుపాయాలను తనవిగా చేసుకుంటూ, కంప్యూటర్‌లో ఇతర సాఫ్ట్‌వేర్స్ ఉపయోగిస్తుంటే కావాల్సిన వాటిని సపోర్టు తీసుకుంటూ పనిచేయడం క్రేజీ బ్రౌజర్ ప్రత్యేకత. ఇందులో అడ్వటైజ్‌మెట్ల బాధలేదు. ఖరీదు చేయాల్సిన అవసరమూలేదు. ఉచితంగా ఆన్‌లైన్ నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్రస్ బార్‌లో టైప్‌చేసిన ప్రతి చిరునామాను ఇది గుర్తుంచకుంటుంది. అలాగని వాటికి సంబందించిన కూకీలు, ఇతర ఇమేజ్‌లను కంప్యూటర్‌లో స్టోర్ చేసుకుంటుందనుకునే భయం అక్కరలేదు. అనవసర విషయాల జోలికి ఇది వెళ్లదు. అతి తక్కువ వేగం అంటే 56 కిలోబైట్స్ వేగంతో పనిచేసే ఇంటర్‌నెట్‌లో సైతం కేవలం మూడు నిముషాలలో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ - 7, విండోస్ విస్టాతోపాటు విండోస్ ఎక్స్‌పి, విండోస్ ఎన్‌టి, విండోస్ 2000, విండోస్ 98, విండోస్ 95లలో సైతం ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే క్రేజీ బ్రౌజర్ ఉపయోగిస్తున్నవారికి కొత్త వర్షన్ వచ్చింది డౌన్‌లోడ్ చేసుకొమ్మనే సందేశం డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షం అయింది. ఒక వౌస్ క్లిక్‌తో http://www.crazybrowser.com/download.htm సైటు నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6న 3.01 వర్షన్ విడుదల చేసిన ఆరు రోజులకే మరో వర్షన్ విడుదల చేయడం ఏమిటీ అనే సందేహం కలుగవచ్చు. పాత వర్షన్‌లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఇంటర్‌నెట్‌లో విహరించడానికి వీలుగా సదుపాయాలు ఇందులో జోడించారు. మోదట 2002 సంవత్సరం జనవరి 15 తొలి క్రేజీ బ్రౌజర్ 1.0వర్షన్‌ను ఆవిష్కరించారు. ఆతరువాత ఎనిమిది సంవత్సరాల కాలంలో వరుసగా సుమారు 15 మార్లు దీనిని అప్‌డేట్ చేస్తూ వచ్చారు. వివిధ ప్రాంతీయ భాషలను సపోర్టు చేసే విధంగా c:\Program Files\Crazy Browser\Languages\ నేరుగా ఢౌన్‌లోడ్ చేసుకుంటుంది. బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేశాక ఒకమారు కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన వెంటనే కంట్రోల్ ప్యానల్ లాంగ్వేజస్ మెనూ నుంచి ప్రాంతీయ భాషలను సపోర్టు చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రత్యేక ప్లగ్గిన్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లగ్గిన్స్ C:\Program Files\Crazy Browser\Plug-ins\ నుంఛి నేరుగా పనిచేస్తాయి. వీటిని అప్‌డేట్ చేసిన వెంటనే సిస్టమ్స్‌ను ఒక మారు రీస్టార్ట్ చేస్తే చాలు బ్రౌజర్‌పై ప్లగ్గిన్స్ ప్రత్యక్షం అవుతాయి. పాప్‌అప్ బ్లాక్ చేయడంవల్ల అనవసరమైనవి సిస్టమ్స్‌లో చేరుతాయనే భయం లేదు.

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

ట్రాన్స్‌లిటరేషన్ టూల్

ప్రాంతీయ భాషలకు వెబ్‌లో గూగుల్ పట్టం కడుతోంది. ఇప్పటికే వెబ్ బ్రౌజర్ల ద్వారా ఆన్‌లైన్ పేజీ ఒపెన్ చేసిన తరువాత కావాల్సిన ప్రాంతీయ భాషలో టైప్ చేసుకునే విధానాన్ని గూగుల్ ఇదివరకే ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ ఐఎంఇ డౌన్‌లోడ్‌కు ఈ వారం సిద్దం చేసింది. ఇప్పటివరకు కేవలం బ్రౌజర్ ఒపెన్ చేసి కావాల్సిన వెబ్‌పేజీ ఒపెన్ చేసినప్పుడే ఎంచుకున్న ప్రాంతీయ భాషలో టైప్ చేసే ఏర్పాట్లను ప్రత్యేక పరిస్థితులలో కల్పించింది. కేవలం ఆన్‌లైన్‌లో ఉంటేనే ఈ సదుపాయం కలిగేది. కానీ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో కూడా ప్రాంతీయ భాష ఎంచుకునే విధంగా మొట్టమొదటి సారి యూనిక్ కోడ్‌లో టైప్‌చేసుకునేలా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌కు ఈ వారం నుంచి వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్http://www.google.com/ime/transliteration/వెభ్‌పేజీలో సిద్దంగా ఉంది. ట్రాన్స్‌లిటరేషన్ ఐఎంఇ అంటే ప్రాంతీయ భాషలోకి పదాలను మార్చుకునే ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్ అన్నమాట. ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌ను కంప్యూటర్‌లో పై సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోదు. వెంటనే తగు సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానల్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఒక భాషను ఎంచుకున్న వారికి ఒకే భాషలో టైప్ చేసుకునే సదుపాయం కలిగేలా, బహుళ బాషలు ఎంచుకున్న వారికి బహుళ భాషలలో టైప్ చేసుకునేలా ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఫాంట్స్ ఇన్‌స్టాల్‌కోసం విడివిడిగా ఆయా ప్రాంతీయ భాషలను ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, ఉర్దూ, గుజరాతీ, అరబిక్, బెంగాలీ, ఫరీషయన్, గ్రీక్ పద్నాలుగు భాషలలో ట్రాన్స్‌లిటరేషన్ ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్ లభ్యం అవుతోంది. సాధారణంగా వెబ్ పేజీల నుంచి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయగానే ప్రోగ్రామ్ మేనేజర్‌లో అప్లికేషన్ టూల్ బార్ ప్రత్యక్షం అవుతుంది. ఇందుకోసం ముందుగా కంట్రోల్ ప్యానల్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ హెల్ప్ పేజీని యూజర్‌కు మార్గదర్శకంగా నిలుస్తుంది. అలా కానీ పక్షంలో http://www.google.com/ime/transliteration/help.html#installation వెభ్‌పేజీని ముందుగా ఒపెన్ చేసి గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ ఇన్‌పుట్ మెథడ్ రన్ చేయడానికి కంప్యూటర్‌ను ఎలా సిద్దం చేయాలో తెలుసుకోవాలి. ప్రసుతం ఈ అప్లికేషన్ టూల్ విండోస్ ఎక్స్‌పి, విస్టా, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లలో పనిచేసేలా రూపొందించారు. ప్రస్తుతం ఇది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పనిచేస్తుంది. ట్రాన్స్‌లిటరేషన్ ఇన్‌పుట్ మెథడ్ కంప్యూటర్‌లో పనిచేయడం ప్రారంభించాక క్యూడబ్లుఇఆర్‌టి., కీబోర్డు ఆధారంగా టైప్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసిన పదాలు వర్డ్, నోట్‌పాడ్, అన్ని వెబ్‌పేజీలలో కట్ పేస్ట్ పద్దతిలో పేస్ట్ చేయవచ్చు. అయితే ప్రాంతీయ భాషలలో వెబ్‌పేజీలను రూపొందించుకోవడానికి వీలుగా ఇదివరకే గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ పద్దతిని చాలా కాలం క్రితమే ప్రవేశపెట్టింది. ఆర్కుట్, జి-మెయిల్, బ్లాగ్‌లలో నేరుగు కంపోజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది. లిప్యాంతరీకరణ పద్దతిలో కావాల్సిన పదాలను తెలుగులో ఉచ్చారణకు అనుగుణంగా ఇంగ్లీషు కీబోర్డుపై టైప్ చేసి స్పేస్ ఇచ్చిన వెంటనే అది తెలుగు పదం కనిపించేలా గూగుల్ దీనిని ప్రవేశ పెట్టింది. ఇలా టైప్ చేసిన పదం వెబ్‌పేజీల అప్‌లోడ్‌కు కానీ, ఇ-మెయిల్‌లో లేఖలా కానీ పంపుకునే సదుపాయం కల్పించింది. ఆఫ్‌లైన్‌లో కూడా యూనిక్‌కోడ్‌లో కావాల్సిన ప్రాంతీయ భాషలో టైప్ చేసుకుని సదరు ఫైళ్లను కంప్యూటర్‌లో సేవ్ చేసుకున్న తరువాత వెబ్‌లోకి అప్‌లోడ్ చేసుకునే విధానం వల్ల యూజర్లకు మరింత ప్రయోజన కరంగా ఉంటుంది. అంతే కాకుండా నాన్ లాటిన్ భాషలలో కూడా వెబ్‌పేజీలు చక్కగా దర్శనం ఇచ్చే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో గూగుల్ లాబ్ అందించిన వెబ్ పేజీ http://labs.google.co.in/keyboards/telugu.html కూఢా ప్రాంతీయ భాషలలో ఇంటర్‌నెట్ ఆన్‌లైన్‌లో టైపింగ్‌కు సదుపాయం కల్పించింది