22, నవంబర్ 2021, సోమవారం

కోటి దీపోత్సవంలో కోటి కాంతులు

 జగదార్యుల ప్రవచనం
 కోటి దీపోత్సవంలో కోటి కాంతులు

జగదాచార్యులు శ్రీమత్‌ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారు కోటి దీపోవత్సవానికి విచ్చేసి అమృత ప్రవచనంతో పేరుకు పోయిన అంధకారాన్ని తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించారు. అందరినీ కలుపుకుని సమతామూర్తి ఆవిష్కరణ ఘట్టం కొద్ది రోజులే ఉన్నాయంటూ, మనను సమాయత్తం పరచడానికి అద్భుత విషయాలు ఆవిష్కరించారు. వారి ప్రసంగాన్ని యధాతథంగా మీ ముందు ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.


‘ఆపదామపహర్తారం  దాతారం సర్వసంపదాం’
‘వందే గురు పరంపరాం’
‘అందరం ఒకసారి చెప్తా
వందే గురు పరంపరాం’
ప్రియా భగవత్‌ బంధువులారా!,
కార్తీకమాసంలో బయటి ప్రపంచానికి చీకట్లను పోగొట్టే, దీపాలను వెలిగించే మహోత్సవాన్ని  ఈ భాగ్యనగరంలో ఆరంభం చేసి అది అనేక ప్రాంతాల్లో వ్యాపించేటట్లు చేయడమే కాకుండా ఈ సందర్భంగా మన హృదయాల్లో ఉండేటటువంటి అహంకారపు చీకట్లను కూడా తొలగించుకోవడానికి కావలసి నటువంటి దైవ సాన్నిధ్యాన్ని మన లోపల ప్రేమ రసాన్ని పొంగింప చేసే అద్భుత మైనటువంటి కార్యక్రమాలకి రూపుదిద్ది నటువంటి మన భక్తి టీవీ, శ్రీమాన్‌ నరేంద్ర చౌదరి దంపతులకి మేము ముందుగా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం.
మాసం కార్తీకం, కృత్తిక దీపోత్సవాలు మన గ్రంధాల్లో, ఆగమాల్లో, ధర్మశాస్త్రాల్లో మహానుభావులు అయినటువంటి ఋషులు మనకు చెప్పారు. ఆచరించాలి అని. ఇప్పుడే మన పూజ్య శ్రీ కుర్తాళం పీఠాధిపతి స్వామి మనకు ఒక అందమైన కథ చెప్పారు.
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది కార్తీక దీపాన్ని గురించి. ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారి యొక్క కుమార్తె. చక్కటి జ్ఞాని, మంచి బుద్ధిమంతురాలు.  ఆ రాజు గారి కుమార్తె జ్ఞానంతో పాటు చక్కటి వినయశీలి కూడా. అయితే ఆ మహనీయురాలిని ఒకసారి అడిగారు, అమ్మా నువ్వు ఏం చేసుకుని ఇంత చక్కటి విద్యను, వినయాన్ని పొందావు తల్లి అని. ఆ పిల్లకి బయటి జ్ఞానంతో పాటు ఆంతరం అయినటువంటి జ్ఞానం కూడా భగవంతుడు అనుగ్రహించాడు.
ఆ పిల్ల చెప్పిందట అయ్యా నేను పూర్వజన్మలో ఒక ఎలకని. జీవులకి కర్మ వల్ల అనేక దేహాలు వస్తాయి కదా అని మరి మన వేదాలు చెబుతున్నాయి. ఈ జీవుడు ఎప్పుడూ ఉంటాడు. జీవుడు సంచరిస్తూ ఉంటాడు దేహంలోంచి దేహంలోకి. కర్మని బట్టి ఒకసారి పైకో ఒకసారి క్రిందకు వెడుతూ వుంటాడు. ఈ వేళ మన మానవ శరీరంలో ఉన్నాం. దీనికి ముందర ఎక్కడున్నావో తెలియదు కదా. దీని తర్వాత ఎక్కడికి వెళ్తామోకూడా మనకు తెలియదు. ఆ పిల్ల చెప్పిందట నేను దీనికి ముందుండే జన్మలో ఒక ఎలకని. ఆలయాల్లో తిరుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడ దీపాల్లో నూనె పోస్తూ ఉంటారు కనుక ఆ నూనెను త్రాగుదాము అని నేను ఆలయాలు తిరుగుతూ ఉండేదని. ఒకసారి కార్తీక మాసం వచ్చింది. ఆలయంలో చిన్న దీపం మినుకు మినుకు మంటుంది. నేను ఆ దీపంలో ఉండే నూనె తాగుదామని వెళ్ళా. అయితే దీపం దాక దిగి అందులో మూతిపెట్టే సమయానికి ఆలయాల్లో సాధారణంగా పిల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి కనుక అక్కడ ఒక పిల్లి కూడా వుంది. అది నన్ను చూసి మ్యావ్‌ మంది. నాకు భయం వేసింది. భయం వేసింది ఆ భయంతోటి దీపం నుంచి కింద పడి పోయా. ఆ తర్వాత నన్ను ఆ పిల్లి తినేసింది. కాని ఆ పడిపోయే సమయంలో నా ముక్కు తోటి అప్పటిదాకా మినుకు మినుకుండే టటువంటి ఆ దీపాన్ని కొద్దిగా పైకి పొడవడం చేత ఆ దీపం పెరిగి పెద్దదై గర్భాలయంలో మంచి కాంతి ఏర్పడిరది.
గర్భాలయంలో దేవుడి ముందర ఒక దీపాన్ని కాస్త పెంచి పెద్ద చేసినటువంటి ఒక సుకృత ప్రభావం ఈవేళ నన్ను ఈ రకమైనటువంటి స్థితిలోకి తీసుకు వచ్చింది.అని ఆ పిల్ల చెప్పినటువంటి చరిత మనకి పురాణాలలో కనిపిస్తుంది. తాత్పర్యం ఏంటంటే ఈ కార్తీకమాసంలో మన అందరం కూడా మనలో ఉండే చీకట్లను తొలగించుకునే ప్రయత్నం చేయవలె. చీకట్లు బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. అంటే రకరకాల స్థానాల్లో ఉంటాయి. ‘ఇంద్రియాణి మనో బుద్ధి: అస్య అనుష్ఠానం వుచ్చ్యతే’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనలో ఉండే కోరికలు గురించి చెబుతాడు. ఈ కోరికలనేటటువంటివి ఒక స్థానంలో ఉండవు అర్జునా. ఇది మన ఇంద్రియాల్లో ఉంటాయి మనసులో ఉంటాయి బుద్ధిలోనూ వుంటాయి అని చెప్తాడు అయన. అట్లాగే మనలో ఉండేటటువంటి అహంకారపు చీకట్లు కూడా ఈ బయటి ప్రపంచంలో వ్యాపించి ఉన్నట్టే మన ఇంద్రియాలోనూ ఉంటాయి వాటిని ఎలా ఎప్పుడు ఎక్కడ పని చెయ్యాలో తెలియకుండా చేయడానికి, మనసులో ఉంటాయి యోగ్యమైన ఆలోచనలు రాకుండా అడ్డటానికి, బుద్ధి లోనూ ఉంటాయి సరిjైునటువంటి నిర్ణయాలను చేసుకోనివ్వకుండా మనని కలత పరచటానికి. ఇన్ని చీకట్లు పోవాలి అనే మనం కోరుకుంటాం. ఈ చీకట్లన పోగొట్టుకోవడం. బయటి చీకట్లు  అయితే దీపాల వల్ల పోగొట్టుకుంటాం మనం. ఎన్ని లైట్లు వెలిగించాం. మరికొన్ని దీపాలను కొంచం సేపటికి వెలిగించ పోతున్నాం. కానీ లోపల చీకట్లని పోగొట్టేది ఎట్లా. దేనితో లోపలి చీకట్లు పోతాయి.
ఇవాళ ప్రపంచంలో ఎన్నో రకాల చీకట్లు వస్తున్నాయి. కేవలం ధనమే ప్రధానం అనుకోనేటటువంటి ప్రవృత్తులు మనం ప్రతిరంగంలోనూ చూస్తున్నాము. ఇది ఒక రకమైనటువంటి భయంకరమైన చీకటి. మనిషికి కర్మ వల్ల వచ్చింది దేహం అనేది. ఇది మనకి తెచ్చుకుంటే రాలా. మన ఎవరి దగ్గర అప్లికేషన్‌ పెట్టి మనం దీన్ని సంపాదించలా. మన తల్లిదండ్రుల దగ్గర కూడా మనం కోరి ఈ దేహాన్ని మనం పొందాలా. ఎవడో ఇచ్చాడు. ఎవడిచ్చాడో మనకి తెలీదు. కానీ ఎవరో ఇస్తేనే ఇది వచ్చింది. దేహంతో పాటు ఈ వేళ మనం ఇవి అని అనుకునే లింగము కానీ, వయసు కానీ, కులము కానీ, వర్గము కానీ, వర్ణము కాని, రంగు కానీ ఇవేమీ మన తెచ్చుకుంటే రాలె. మనం తీసేస్తే పోవు. తాత్కాలికంగా వేసుకొనే రంగులు వల్ల కొన్ని తాత్కాలికంగా కనిపించకపోవచ్చు కానీ సహజమైన టటువంటి స్థితి మారేది కానే కాదు ఈ దేహం ఉన్నంత వరకు కూడా. మనం తెచ్చుకోకుండా వచ్చిన దాన్ని చూసి మనం గర్వపడ్డం ఏం తెలివంటాం.
కులం పేరుతో, మతం పేరుతో, వరణం పేరుతో, వర్గం పేరుతో, రంగు ఆ మధ్య దాకా ఇతర దేశాల్లో ఎంత పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి. కేవలం రంగు గురించి. శారీరకమైనటువంటి వారు తెచ్చుకోకుండా వచ్చినటువంటి రంగు గురించి. ఇది ఒక భయంకరమైనటువంటి చీకటి. ఈ వేళ మనం చూస్తున్నాం ఒకే మతానికి సంబంధించి నటువంటి వ్యక్తులలో కూడా తమ వారిని తామే చూసి సహించలేని ఒక దారుణమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం వాయువ్య దేశాల్లో.  ఎందుకు వస్తున్నాయి ఇవి. లోపల ఏర్పడ్డ చీకటి ప్రభావం చేత. ఈ చీకట్లు తొలగాల్సిన అవసరం ఉన్నది. ఇది మనకి జ్ఞాపకం చేయడం కోసమే ఈ బయట దీప ఆవిష్కరణ చేసుకోవడం.
ఈ కార్తీకమాసంలో రాబోయేటటువంటి ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని పేరు పెట్టారు మహానుభావులు అటువంటి మన పెద్దలు, ఋషులు. ఉత్థాన ఏకాదశి అంటే భగవంతుడు మేల్కాంచేటటువంటి ఏకాదశి అని అర్థం. ఆ మరునాటికి క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. స్వామి పాలకడలిలో పవళించి నాలుగు నెలలపాటు, ఆ ఏకాదశి నాడు మేల్కాంచి ద్వాదశినాడు క్షీరములతోటి అభిషేకిస్తాడట ఆయన యొక్క సందర్శనానికి సకలదేవతలు సమావిష్టులు అవుతారట. దాన్ని స్మరించుకుంటూ కార్తీక పూర్ణిమ నాడు చాలా అద్భుతమైనటువంటి ఉత్సవాలు చేస్తారు. ఆలయాలన్నిటా కూడా పవిత్రోత్సవాలు కూడా చేసుకుంటారు. స్వామి యొక్క ప్రభావం లోకమంతా తెలుయు గాక, స్వామి యొక్క ప్రభావం అందరి దుఃఖాలన్నీ దూరం చేయుగాక. భగవంతుడి యొక్క ప్రభావం అందరిలో చీకట్లో కూడా తొలగించుగాకా అని ప్రార్థనలు చేస్తూ ఆలయాల్లో పవిత్రోత్సవాలు చేస్తారు. స్వామి మేల్కాంచే చేసే సమయానికి మనం సిద్ధపడాలి కదా, ఆయన నిదిరించినా మన కోసం, ఆయన మేల్కాంచినా మన కోసమే. నిజానికి భగవంతుడికి ఏ ఆయుధాలు ఉండవు, ఏ అలంకరణలు ఉండవు, అవసరంలేదు కూడా. కానీ ఆయన ఆయుధాలను ధరిస్తాడు, అలంకరణలని స్వీకరిస్తాడు ఎవరి కోసమని. మహానుభావుడు లేనటువంటి ఋషులు చెప్పారు
     నాతే రూపం నచ ఆకారః నాయుధానీ నచ ఆస్పదం
     తథాపి పురుషాకారః భక్తానాం త్వం ప్రకాశసే.
హే భగవాన్‌ నీకు ఇదమిత్థంగా ఇంతే రూపం అనే హద్దు లేదు. అర్థాత్‌ అన్ని  రూపాలు నీవే. ఆయన పొట్టి వాడు, పొడుగు వాడు, లావు వాడు, సన్నని వాడు ఇలాంటి ఆకృతులు ఆయనకి పరిమితమై లేవు. అంటే ఈ లోకంలో చూసే అన్ని ఆకృతులు ఆయనవే. వీటికంటే అతీతమై ఆయన ఉంటాడు అని అర్థం. ఆయనకు ఏవో కొన్ని మనకి తెలిసిన ఎటువంటి పరిమితమైన కొన్ని ఆయుధాలు అర్పిస్తా, కానీ అంతవరకే ఆయనకు సీవితము కాదు అంటే సకల ఆయుధాలు ఆయనవే కాని ఆయనకు అవసరం లేదు. ఆయన వైకుంఠంలో ఉంటాడా, కైలాసంలో ఉంటాడా, పాల్కడలిలో ఉంటాడా, అయోధ్య నా, బృందావనమా మరొకటా. ఆయనకు ఇదమిద్దం అనేటటువంటి చోటు లేదు. లేదు అంటే ఆయన ఎక్కడ ఉండడానికి కాదు అని అర్థం ఆయన పరిమితుడు కాడు అని అర్థం. ఆకాశానికి చోటెక్కడ? మీ ఊర్లో నా, మా ఊర్లో నా, మీ పెరట్లో నా, మా పెరటిలోనా ఆకాశం అంతటా అది లేని చోటంటూ లేదు. గాలికి చోటు ఎక్కడ. అంతటా ఉంటుంది లేని చోటంటూ లేదు. ఈ గాలి, ఆకాశం లాంటివే ఇలా ఉంటే, అలాంటి వాటిని లో తన దేహంలో మూల కలిగినటువంటి ఆయనకి ఇది చోటు, ఇది స్థానము, ఇది ఆకృతి అని ఎట్లా చెబుతామయా? నువ్వు ఏ రూపం చూసిన అది ఆయన రూపమే. అర్జునుడుకి సందేహం కలిగితే పదకొండవ అధ్యాయంలో చూపించాడు తనయోక్క విరాట్‌ రూపాన్ని. పాపం అర్జునుడు కాస్త గాబరా పడిపోయాడు. ఏమి అవుతుందో తెలియదు, ఎక్కడున్నానో తెలియలేదు, చుట్టూ ఏమవుతుందో తెలియలేదు. అమ్మో అమ్మో నేను చూడలేనీ రూపాన్ని ఆది తెలియటం లేదయా, మధ్యమూ తెలియటం లేదయా, అంతమూ తెలియటం లేదయా. నన్ను అనుగ్రహించి ఈ రూపం నాకొద్దు. నాకు బాగా అలవాటు అయినటువంటి రూపం చూపించవా అని అడిగాడు అర్జునుడు.  అన్ని రూపాలు చూపించాడు తనలో,  అలాంటివాడు అయినప్పటికినీ కూడా ఎందుకోసం ఆయనకు ఒక ఆకృతి, ఒక రూపం, కొన్ని ఆయుధాలు, ఏవో కొన్ని స్థానాలు ఎందుకు ఏర్పాటు చేశారు? చేయలా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికోసం, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరి హృదయాల్లో ఉండేటటువంటి చీకట్లు తొలగించుకుని వెలుగులు నింపుకోవాలని కోవాలనే కోరికతో తమ హృదయములనేటువంటి కలశాలను సిద్దం చేసుకుని పెట్టుకుంటారో అందులో ప్రేమ రసాన్ని నింపడం కోసం అని. వారి కోసం నువ్వు రూపధారణ చేస్తావు. వారికి ఏది నచ్చితే అట్లా, ఎంత నచ్చితే అంత. నది దగ్గరికి వెళ్లిన వాడికి తాను తీసుకువచ్చిన అటువంటి పాత్రకి తగ్గట్టుగా అందులోని నీటిని తీసుకున్నట్టుగా ఎట్లా అవకాశం ఆ నది ప్రసాదిస్తుందో సర్వేశ్వరుడు అయినటువంటి భగవానుడు కూడా తనని ప్రేమించేటటువంటి భక్తశిఖామణుల కోసమని వారు వారు ఏ యోగ్యతని మనసులకు కలిగించుకుంటారో, దానికి తగ్గట్టుగా తనని తాను రూపుదిద్దుకొని వాళ్ళ హృదయాల్లో నిండాలి అని కోరుకుంటాడు. అందులో వుండేటటువంటి స్వచ్ఛమైన ప్రేమకి తన అభిషిక్తుడు అవుతాడు.
పాలతో అభిషేకం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి రేపు రాబోయే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో వస్తుంది మనకి అయితే అది మామూలు బయట దొరికేటటువంటి పాలు కావు. ఆ పాలు ఇచ్చేవి మనం మామూలుగా చూస్తూ ఉండేటటువంటి గోవులు కావు. సర్వోపనిషదో గావః అని చెప్పినట్లుగా వేద వాజ్ఞ్మయమంతా గోవులయితే అవి ప్రసాదించేటటువంటిది భగవంతుని యొక్క దివ్యమైనటటువంటి అద్భుతమైన కల్యాణ గుణాలనే క్షీరము. ఆ క్షీరంతో స్వామిని అభిషేకించాలి. అలా అభిషేకించాలి అనుకునే వారి కోసం అని తాను ఆ పాల్కడలి నుంచి మేల్కొంటాడు. వారి యొక్క ప్రేమకి తాను కరుగుతాడు. వారేం చెబితే అది చేస్తాడు.
యశోదమ్మ రోటికి కట్టి, చేతిలో బెత్తం పట్టి, నోటిని తెరిచావంటే అమ్మో కొట్టేస్తుంది ఏమో అని భయం వేసి, నోరు తెరవటానికి భయంవెసి, లోపల్లోపలే తన రొమ్ములు ఎగరవెస్తూ, అసలే నల్లనివాడు, కంటికి నల్లని కాటుక, కారే నీళ్లతో ముఖమంతా పులుముకుంటూ ఏడుస్తూ నిల్లబడ్డాడు. మరి చేతకానివాడుకాదు. ప్రేమ అనే త్రాటికి కట్టబడ్డాడు. ప్రేమ కలిగినటువంటి ఒక నారీమణి ప్రేమకి తాను కట్టించుకున్నాడు రోటికి. కానీ దురహంకార పూరితులైన వ్యక్తులకి దరి చేరడానికి కూడా అవకాశం ఇవ్వని అప్రతిహతుడు అయ్యాడాయన. ప్రేమ కలిగిన వారి కోసం నువ్వు ప్రకాశిస్తావు, ప్రకాశం చేసుకుంటారు. వాళ్లే రూపం కోరితే ఆ రూపంలో, యశోదమ్మ నీ బాల లీలలు చూడాలయ్య అంది, అందుకోసం బాలుడుగా చూపించావు, అంతకుముందు దేవకీ దేవి నా గర్భాన జన్మించమని కోరింది, గనుక జన్మించాడు. ఎవరెంతకోరితే వారికి అంత. బాల లీలలు చూపమంటే అక్కడ లీలలే చూపించడం జరిగింది.
గురువు అంటే మనలో ఉండేటటువంటి చీకటి, అది ఎంతదైనా దాన్ని పారద్రొలెటటువంటి శక్తి కలిగిన మహనీయుడు అన్నమాట. కొన్ని కొన్ని గుహల్లో కొన్ని వేల సంవత్సరాలుగా చీకటి అతి దట్టంగా పులుముకొని ఉంటుంది. చీకటి పారద్రోలడానికి ఒక దీపం చాలు. అయితే అలాంటి చోట్ల వెలిగించడం అనేది చాలా కష్టం. కానీ వెలిగించగలిగిన వ్యక్తులు అయితే కావాలి. ఆ వ్యక్తులను మనం గురువు అంటాం. అయితే ఇందులో చిన్న చిన్న చిన్న చిన్న పదాల మార్పులు మన పెద్దలు సూచించారు. గురువు, అధ్యాపకుడు ఆచార్యుడు ఇలా కొన్ని పదాలు చెప్పారు. గురువు అంటే సామాన్యంగా ఏ చీకటినైనా పోగొట్టేవాడు. మనకి అ ఆ లు రావు అనుకోండి అక్షరాలు దిద్దించిన వాడు కూడా గురువే అవుతాడు. మన చుట్టూ ఉండే పరిసరాలను పరిచయం చేసే వ్యక్తి కూడా గురువే అవుతాడు. కానీ మనని ఉజ్జీవింపజేసే అంటే మనని మనం తెలుపు కొనగలిగేటటువంటి, మామూలుగా అయితే శరీరం బతకడానికే జీవన అంటాము. లోపల ఉండే వాన్ని కూడా తెలిపేదే ఉజ్జీవం అంటాము. ఉజ్జీవింప చేసేటటువంటి గ్రంథాలని మనకి తెలియజేస్తే అధ్యాపనం అంటాం. అందులో ఉండేటటువంటి సారాన్ని తానాచరించి మనకి ఆచరింప చేయగలిగే యోగ్యుడు అయితే ఆయన్ని మనం ఆచార్యుడు అంటాము.
ఈ సమాజానికి జ్ఞాన దీపాన్ని వెలిగించిన ఇటువంటి మహానుభావులు అయినటువంటి ఆచార్యులు ఎందరో వున్నారు. ఆదిశంకర భగవత్పాదులు దగ్గర నుంచి మనం ఆరంభం చేస్తే, ఆ తరువాతి కాలంలో అంటే పదకొండవ శతాబ్దంలో ఈ జాతికి మానవజాతి కంతటికీ కూడా అద్భుతమైనటువంటి ఉజ్జీవన మార్గాన్ని చూపినటువంటి ఆచార్యవర్యుడు భగవద్రామానుజ ఆచార్య స్వామి. వైదిక మార్గాన్ని ముల్లు తీసి సుగమంచేశారు శంకరభగవత్పాదులు. ఆ మార్గంలో అందమైన భవనాలు నిర్మించారు భగవద్‌ రామానుజాచార్య స్వామి.  ఈ సమాజానికి ఆ మహానుభావులు చూపినటువంటి మార్గం సర్వధా సర్వధా శరణ్యం. విశేషించి పదకొండవ శతాబ్దానికి పూర్వం దేవుడి గురించిన మాట బయట చెప్పటానికి వీలు లేకుండా ఉండేది. ఆడవాళ్ళయితే దేవుడి మాట ఎత్తటానికి వీల్లేదు. దేవుడు గురించి చెబితే నాలిక తీసేయాలి. వింటే చెవుల్లో సీసంతో మూసేయాలి. కరిగించిన సీసం తోటి. ఇది వాస్తవం ఆ రోజుల్లో ఉండేది. అలాంటి మాటలు మరి కొన్ని పుస్తకాలు కూడా ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ రోజుల్లో దాన్ని కఠినంగా పాటించేవారు కూడా.
 మనమంతా శంకరభగవత్పాదులు యొక్క కథని చదివి ఉంటాము ఆ మహానుభావుడు స్నానమాచరించి బయటకు వస్తే ఎదురుకుండా ఒక దళితుడు కనిపిస్తే మే నడిచే మార్గం లోకి రాకూడదని తెలియదా తప్పకో ఇక్కడినుంచి అంటే ఆ వ్యక్తి అడిగాడట ఆ మహనీయుని శంకరభగవత్పాదులు వారిని. ఎవరిని తొలగమంటావ్‌ ఇక్కడి నుంచి శరీరాన్నా, ఆత్మనా అని అడిగాడు. శరీరం పంచభూతాలు అవి వాటిని మనం ఏం చేసే ప్రశ్నే లేదు. వాన వస్తే నీళ్లలో తేవాలని, ఎండ స్తే కావాల్సింది, నేలమీద మట్టి వుంటే అంటించుకోవసిందే, కనక పంచభూతాలను తొలగమనడానికి సరైనటువంటి కాదు. ఇక ఆత్మ అంటావా? నీ సిద్ధాంతాల్లో సర్వవ్యాపి కదా, అంతట ఉండేది కదా, అది లేని చోటే లేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళమంటారు. కథ చెప్పడానికి ఇప్పుడు మేము ఆ విషయాన్ని ప్రస్తావన చేయలేదు. కానీ ఆనాటి సామాజిక మైనటువంటి స్థితి అట్లా ఉండేది. ఎవరి తప్పు కాదు. ఒక నాటి సమాజ స్థితి అది.
రామానుజాచార్యులవారు పదకొండవ శతాబ్దంలో వచ్చినప్పుడు సమాజంలో ఉండేటువంటి అసమానతలని వారు గమనించారు. 32 సంవత్సరాల కాలం జీవించి ఉన్నాడు శంకరభగవత్పాదులు. కొద్దిపాటి సమయంలో ఆ మహనీయుడు సాధించినటువంటి కార్యం వర్ణనాతీతం.  వారు మరి కొంత కాలం జీవించి ఉంటే రామానుజాచార్యులవారి అవసరం వచ్చి ఉండేది కాదు సమాజానికి. కాని తరువాత రామానుజాచార్యులవారు 120 సంవత్సరాల కాలం ఈ భూమ్మీద వేంచేసి ఉండి నలుచెరగులా వారు సంచరించి, సమాజంలో ఉండేటటువంటి రుగ్మతలను గమనించి వాటిని నిర్మూలించే అటువంటి మహోద్యమాన్ని సాగించారు.
కులం ఏదైనా, జాతీయ ఏదైనా రంగు ఏదైనా, లింగం ఏదైనా మనమందరం పుట్టింది ఈ మట్టి మీద. ఈ భూమాత మనందరికీ కన్నతల్లి. ఈ భూమిని ఉద్ధరించిన ఇటువంటి భగవంతుడు అందరికీ తండ్రి. మనందరం వారి సంతానమే. కర్మ వల్ల ఏర్పడ్డ దేహాల వల్ల మనలో అంతరాలు ఉన్నప్పటికీని మనందరం ఒకే భగవంతుడికి సంతానం అయితే ఆ భగవంతుడిని నామాన్ని చెప్పటానికి, తండ్రి తల్లి యొక్క నామాన్ని పలకడానికి అవరోధం ఎందుకు ఉండాలి. ఒకవేళ కొందరు దీనులో, దళితులో అయితే నిజానికి భగవంతుడి యొక్క ప్రేమ వాళ్ల యందే అధికముగా ఉంటుంది, అందరికి తెలుసును. ఒక తల్లికి ఒక పిల్లవాడు సామాన్యంగా ఆరోగ్యంగా ఉండి మరొక పిల్లవాడు కొంచెం అనాకారి అయితే, లేదు అంగవికలుడు అయితే తల్లికి ఎవరి మీద ఎక్కువస్మరణ ఉంటుంది. ఏదైనా ఒక స్వీటు హార్టు చేస్తే ఎవరిని ముందు తలుచుకుంటుంది ఆ తల్లి.
ఎవరు కాస్త అనాకారో వాణ్ని ముందు తలుచుకుంటుంది. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దీనులని, దళితులనే ముందు స్మరిస్తాడు. ఎందుకంటే వారియందు తన కృప ఎక్కవ అవసరం కనుక. అందుకే మనకి భగవంతుడు మీద నిజమైన ప్రేమ ఉన్నట్లయితే, భగవంతుని మనం నిజంగా కనుక మనం గౌరవించ తలచుకుంటే, ఆయన ప్రేమ ఎవరి యందు ఉంటుందో వారిని ముందు మనం జాగ్రత్తగా గమనించడం బాధ్యత. అందుకే దళితులకి కూడా ఆ భగవంతుని దర్శించే అధికారం కావాలి అని వాళ్ళకి కూడా ఆలయ ద్వారాలు తెరిచి భగవంతుని దర్శింప చేసినటువంటి చారిత్రక ప్రధమ ఆచార్యుడు భగవద్‌ రామానుజ ఆచార్య. అలాంటి వాళ్లకి కూడ శ్రద్ధ కలిగితే నేను కూడా బాగు పడాలని కోరిక కలిగితే వారికి కూడా భగవంతుడి మంత్రాన్ని అందించాలి అని భగవాన్‌ మంత్రాన్ని అందరు అందించినటువంటి మహోదార వ్యక్తిత్వం రామానుజ ఆచార్యునిది. అందుకే రామానుజాచార్యులు ఒక మత గురువు కాదు ఒక సంఘ సంస్కర్త. ఆ వేళ మహిళలకు కూడా సాధికారికత అందించినటువంటి మహనీయుడు భగవద్రామానుజ ఆచార్యుడు. ఇవాళ సమాజంలో పరస్పరము వ్యక్తుల మధ్య అధికారపు పోరాటాలు, లేదు రకరకాలైన ఇటువంటి విపరీత ధోరణులు తోటి అణిచివేత చర్యలు మనకు కనిపిస్తున్నాయి అంటే వ్యక్తులలో ప్రేమ లోపమే కదా దానికి కారణం. నా వాడు కాదు అనుకుంటే ఎలా ఉన్నా కగలించు కోవాలని కోవాలనిపిస్తుంది. నా వాడు కాదు అనుకుంటే వాడెలా వున్నా దూరం అనాలనిపిస్తుంది.
నా ఈ భావన కావాలి. అయితే ఆ భావన మనలో ఎందుకు కలుగుతుంది నువ్వెవరో, నేనెవరో కానీ మన అందరం ఒకటి అనే విషయం తెలియ చేయాలంటే మన అందరి మధ్య ఒక కామన్‌ కనెక్టవిటీ కావాలి. అందరి మధ్య ఉండేటటువంటి ఒక సంబంధం దైవం తోటి మాత్రమే. అందుకే మనం అంతా భగవద్‌ బంధువులకు. భగవంతుడు ద్వారా సంబంధించిన వాళ్ళం, పరస్పరము సహోదరులను అవుతాం అందుకే దానిని గుర్తింపు చేయడానికి అవసరమైనటువంటి ఆ నారాయణ మహామంత్రాన్ని గోపురమెక్కి రుచి కలిగిన వారికి తాము అందించడమే కాకుండా ఈ విశాల విశ్వంలో ఎక్కడ ఎవరికి రుచి ఉన్నా ఈ మంత్రాన్ని అందించండి. అంటూ ఒక అవిచ్ఛిన్న మైనటువంటి పరంపరని కొనసాగించడం మహనీయుడు భగవద్‌ రామానుజాచార్య స్వామి. ఈ వేళ సమాజంలో మనం చూస్తూ ఉండి ఉంటే అంతరాలు అంతరించాలంటే, నా అనే ప్రేమ తిరిగి మనలో రావాలి. అందుకే ఈ వేళ సమాజానికి మళ్లీ  రామానుజుల వారు అందించిన సందేశం స్పూర్తి కావాలి. అనే మన ఈ భాగ్యనగరంలో, ఈ భాగ్యనగరానికి కాదు మన దేశానికి, ప్రపంచానికి శోభాయమానంగా భగవత్‌ రామానుజుల వారి వెయ్యేండ్ల పండుగ మనం పురస్కరించుకుని ఒక అద్భుతమైనటువంటి మూర్తి ప్రతిష్టాపనని రేపు మాఘ మాసం ఆరంభం కాగానే అంటే ఫిబ్రవరి 2 నుంచి 14 దాకా ఒక 1035 కుండాల తోటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణ మహాయజ్ఞం అక్కడ జరగబోతోంది. మనకి లభించేటటువంటి నాలుగు వేదాల్లో సుమారు ఏడు శాఖలు ఉన్నాయి. వాటన్నిటికీ పారాయణం జరగబోతోంది. వాటితో హవనం జరగబోతోంది. మన వైదిక వాజ్గ్మయం అంతా అక్కడ శ్రవణం చేసే అద్భుతమైనటువంటి అవకాశం మనకి దక్కబోతోంది.
మన ప్రధాని, రాష్ట్రపతి దాంట్లో పాల్గొనబోతున్నారు. మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జరుపుకొందాం. ఇక్కడ మన ఈ భాగ్యనగరంలో కొన్ని సంవత్సరాలుగా ఈ దీపోత్సవాన్ని మనందరం కలిసి జరుపుకోవాలి అని ఒక సామాజిక కార్యక్రమం భక్తి టీవీ అందిస్తోందో అట్లాగా ఈ భక్తికి మూలబీజమైనటువంటి రామానుజుల వారి యొక్క మూర్తి ఆవిష్కరణ మహోత్సవం కూడా మన అందరం కలిసి జరుపుకుందాం. ఈ కార్యక్రమానికి మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి ఎందరో అతిధులు వస్తారు. మనమందరం ఆథిధేయులుగా వచ్చే వాళ్ళని స్వాగతించి వారికి తగినటువంటి ఏర్పాట్లు చేసి వచ్చిన వారికి సంతృప్తిగా అబ్బా చాలా బావుంది అని చేసి పంపడం మనందరి బాధ్యత. మన చౌదరి గారు ఇప్పుడే చెప్పారు మా తోటి స్వామి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నావో రేపు రాబోయే కార్యక్రమంలో అక్కడ కూడా ఇంతకంటే మంచి అద్భుతమైన ఏర్పాట్లను చేసే బాధ్యత మేం తీసుకోబోతున్నాం అని. చాలా సంతోషంగా ఉంది అన్నమాట.మనమందరం కూడా ఆథిదేయులమే. మన ఊరు వచ్చిన వారికి తృప్తి గా తిరిగి వెళ్ళగలిగే టటువంటి వ్యవస్థ అందరం కలిసి చేసుకుందాం.
రామానుజులవారు అందించినటువంటి సమతా స్పూర్తికి ఇది ఒక స్థలంగా తయారు చేద్దాం. అందరిలో కూడా ఒక ప్రేమ, ప్రవాహం దానికే భక్తి అని పేరు అది మంచి విషయాల్లో ఉంటే. ప్రేమకే రకరకాల పేర్లు ఉన్నాయి. పిల్లల విషయంలో ఉంటే వాత్సల్యం అంటాం. పెద్దల విషయంలో ఉంటే గౌరవం అంటే, సమాన వయస్కుల మధ్య ఉండే సఖ్యమంటాం లేదా స్నేహమంతా, భిన్న లింగాల మధ్య ఉంటే దానిని కామమంటాం. పెద్దల విషయంలో దైవపు విషయంలో, మంచి విషయాల్లో ఉంటే దానికి భక్తి అని అంటాం. అయితే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ అనేది ఇప్పుడు కూడా ఏదో చెయ్యాలి అనేదాన్ని డిమాండ్‌ చేస్తుంది.
మీరు చిన్న పిల్లల మీద ప్రేమ కలిగింది అనుకోండి ఒక పండు ఇవ్వాలనిపిస్తుంది. ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది ఎత్తుకుని ముద్దాడాలి అనిపిస్తుంది. ప్రేమంటే ఏదో చేయకుండా ఉండనివ్వదు. భగవంతుడి మీద మంచి విషయాల మీద మన ప్రేమ ఏర్పడితే ఆ మంచిని పదిమందికి పంచడానికి పెంచుతూ పెంచుకోవటానికి మనలో కూడా ఒక ఆరాటం ఏర్పడుతుంది. దానిని మనం అందరం కూడా మన నగరానికి రాబోయేటటువంటి అతిథులందరికీ కూడా అందిద్దాం. రాబోయే  ఫిబ్రవరిలో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి సంసిద్ధులను అవుదాం. ఈ కార్తీకమాసం రాబోయే మాఘ మాసానికి కాంతిని ప్రసాదిస్తూ దీపపు దారులని మనకి అందిస్తూ ఇవాళ  ఆరంభం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమాన్‌ చౌదరి గారు ఇక్కడ చేసినటువంటి అద్భుతమైనటువంటి శుభారంభం ఈ రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి మరింత కాంతిని ప్రసాదించాలి అని దీనిని అందరూ చక్కగా వినియోగించుకుని తమలో జ్ఞాన జ్యోతులను ప్రేమ జ్యోతులను ప్రకాశింప చేసుకునేటట్లుగా తీర్చిదిద్దాలి అని మేము ఆశిస్తూ. మీకు అందరికీ కూడా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం. విశేషించి శ్రీమాన్‌ నరేంద్ర చౌదరి దంపతులకు ఇలాంటి కార్యక్రమాన్ని మరింత చక్కగా చేయగలిగేటటువంటి అవకాశం, శక్తి భగవంతుడు ప్రసాదించాలని మేము ప్రార్థన చేస్తూ  జై శ్రీమన్నారాయణ
వందే గురు పరంపరాం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి