2, జనవరి 2012, సోమవారం

౨౦౧౧ టెక్నాలజీ తీపిగుర్తులు


టెక్నాలజీ తీపిగుర్తులు.విండో
-వి.ఆర్.సి.మూర్తి, December 30th, 2011
ఎన్నో ఆవిష్కరణలు, సంస్కరణలు మోసుకుంటూ వెళుతున్న 2011 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతుంటే, కొత్త ఆవిష్కణలతో 2012 ముస్తాబు అవడానికి సిద్దం అవుతోంది. టెక్నాలజీకి వనె్న తెచ్చినవారు, రూపురేఖలు మార్చినవారిలో కొందరు కాలచక్రంలో కలిసిపోయారు. కొన్నిదేశాలలో ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణ, నిషేధాలు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. చైనా, పాకిస్తాన్, కొన్ని అరబ్‌దేశాలలో సామాజిక నెట్‌వర్క్‌పై నిషేధాజ్ఞల ఉక్కుపాదం మోపిన ఉదంతాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణకు వేదిక అయిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకులలో ఒకరైన స్టీవ్‌జాబ్ ఈ సంవత్సరమే కన్నుమూసారు. ఇది ఇలా ఉంటే యూరోపియన్ యూనియన్‌లో ఉన్న కేసులలో ఆపిల్ విజయం సాధించింది. కొత్త ఆవిష్కరణలో మొబైల్ రంగందే పైచేయిగా ఉంది. కార్యాలనిర్వహణ అంతా మొబైల్ రంగం సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇఆర్‌పి ప్యాకేజీలు సైతం మొబైల్‌లో ఉపయోగించుకునేలా సరికొత్త ప్యాకేజీలు వచ్చాయి. జావాను సొంతం చేసుకున్న ఒరాకిల్ మరింతగా విస్తరించి ఏ ప్లాట్‌ఫారంలోనైనా పనిచేయడానికి రూపుదిద్దుకుంది. కంప్యూటర్, మోబైల్ రంగాల పరికరాలకు పనితీరుకు జావా అప్లికేషన్లు మరింతగా వనె్నతెస్తున్నాయి. ఐన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తీరుతెన్నులు తెలిపే గోష్ఠులు ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. దేశంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పల్లెబాట పట్టేలా మొబైల్ ఇంటర్‌నెట్ ప్యాకేజీలు ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. గతం సంవత్సరంతో పోలిస్తే ఇంటర్‌నెట్ యూజర్ల సంఖ్య 30 శాతం పైగా పెరిగింది. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఇంటర్‌నెట్ ద్వారా లబ్ధిపొందుతున్నవారే ఉన్నారు. ఆర్థిక మాంధ్యం వల్లనైతేనేమి ఇతర కారణాలవల్లనైతేనేమి కంప్యూటర్ ధరలు పెరుగుతున్నాయి. అలాగే పెరిఫిరల్స్ కూడా పరుగులు పెడుతున్నాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ మాట ఎలా ఉన్నా విండోస్ 7లో, ఆండ్రాయిడ్, క్లౌడ్‌లో ఎన్నో కొత్త టూల్స్ వచ్చాయి.
సామాజిక నెట్‌వర్క్‌లో పారదర్శకత పాటించాలని చెపుతూ వస్తున్న భారత ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి సిద్ధ్దపడింది. ఏది ఏమైతేనేం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న, మత వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ కోర్డు డిసెంబర్ నాలుగోవారంలో తీర్పునిచ్చింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కొన్ని దేశాలలో సామాజిక వేదికలపై నిషేధం కొనసాగుతోంది. ఫేస్‌బుక్‌ను చైనా, పాకిస్తాన్, ఇరాన్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిషేధించగా, యూ టూబ్‌ను టర్కీ, థాయ్‌లాండ్, పాకిస్తాన్, చైనా ఇండోనేషియా నిషేధించాయి. అదేవిధంగా ట్విట్టర్‌ను చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బాగర్‌ను ఇథాయోపియా, పాకిస్తాన్, చైనా నిషేధించాయి. వాస్తవాలను తెలియజెప్పుతూ. ఆధారాల దొంతరలతో చరిత్రపుటలు ఆవిష్కరిస్తున్న వికీపిడియాను చైనా, ఇరాన్, పాకిస్తాన్ నిషేధించాయి. సామాజిక నెట్‌వర్క్‌సైట్లపై కొన్ని దేశాలు పాక్షికంగా ఆంక్షలు విధించాయి. వాస్తవానికి వస్తే సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లు నిర్వహణతీరు పారదర్శకంగా ఉండాలన్న వాదనకు బలం చేకూరింది. ప్రాంతీయ భాషలను ఇంటర్‌నెట్‌లో ఉపయోగిస్తున్న దేశాలలో ఇ-పనులు చేపట్టడానికి నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువ మొత్తంలో వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా లేని దేశాలలో మొదటికే మోసం వస్తోంది.
అభివృద్ధి విషయానికి వస్తే అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి క్రమంగా భారత్ కోలుకుంది. అయితే ఉద్యోగాల కల్పనలో వివిధ కంపెనీలు ముందడుగు వేస్తున్న తరుణంలో రూపాయి క్షీణించడం, డాలర్ విలువ పెరుగడంవల్ల ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు సంతోషించాలో బాధపడాలో తెలియక సతమతం అవుతున్నాయి. మానవ వనరుల అవసరం నానాటికీ పెరుగుతోందని ఇటు నాస్‌కామ్, నాస్‌డాక్, డిపార్ట్‌మెంట్‌ఆఫ్ ఎలక్ట్రానిక్ చెబుతున్నాయి. అయితే ఐటి కెరీర్‌లో ఉన్న నిపుల జీత భత్యాల పెరుగుదలకు బ్రేక్‌పడింది. ఈనేపధ్యంలోనే ప్రముఖ ఐటి సంస్థలు విద్యాసంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకోడానికి ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇన్ఫోటెక్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతొ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా పలు ఇంజనీరింగ్ కళాశాలలతో చాలా ఐటి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా క్యాంపస్ ఇంటర్వ్యూలకు ఐటి కంపెనీలను స్వాగతిస్తున్నాయి.
నెట్‌పైయువత చేస్తున్న పరిశోధనలకు గుర్తింపు లభిస్తోంది. యువత సామాజిక నెట్‌వర్క్‌ల వేదికలపై తమ అభిరుచులను పంచుకోవడమేకాదు తమ ఆలోచనలు తెలుపడానికి అనువుగా మలుచుకుని గుర్తింపును తెచ్చుకుంటుంన్నారు. కొందరు పాఠ్యాంశాలపై పరిశోధనలు చేస్తుంటే, మరికొందరు తమకు ప్రవేశం ఉన్న కళలను ప్రదర్శించడానికి ఉపయోగించుకున్నారు. విండోస్ 7 ఒఎస్‌తో నోకియా ఫోన్, క్లౌడ్‌తో ఐ-్ఫన్, ఐ-ప్యాడ్, ఆండ్రాయిడ్‌తో సరికొత్త స్మాట్ ఫోన్లు సంవత్సరం చివరి త్రైమాసికంలో వరుసగా వచ్చాయి. సాఫ్ట్‌వేర్ టూల్స్ విషయానికి వస్తే స్మాట్ టూల్స్ కొత్తగా కుప్పతెప్పలు వచ్చిపడుతున్నాయి. ఇంటర్‌నెట్ ఆధారంగా పనిచేసే వీటిని స్మాట్ పరికరాలలో ఇన్‌స్టాల్ చేసుకోవడంలో ఒక రకంగా యూజర్‌కు ప్రయోజనం ఎలా కలుగుతుందో, వాటి ద్వారా సంక్రమిస్తున్న ప్రకటనల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఫ్లాపీలైతే ఇప్పటికే అంతరించాయి. సిడిల టెక్నాలజీ కూడా ఈ సంవత్సరంతో కనుమరుగు అవుతుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. చౌకగా ఆకాష్ ఆవిష్కరణ భారత నిపుణుల తీరు శ్లాఘించేలా చేసింది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కంప్యూటర్లలో సిడి డ్రైవ్‌లు కనిపించడంలేదు. సామాజికనెట్‌వర్క్ జాబితాలోకి గూగుల్ ప్లస్ చేరింది. కొత్త సంవత్సరంలో గూగుల్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఉత్పత్తులు, మినీ ఐ-పాడ్, అల్ట్రాబుక్స్, మ్యాక్ బుక్‌ఎయిర్, ఆపిల్ టివి, కిండిల్ ఫైర్ 2, ఆపిల్ ఐటివి, ఐపాడ్ 3, ప్లేస్టేషన్ విస్టా, నోక్ ట్యాబ్‌లెట్ 2, 32 మెగా పిక్సల్ కెమారా నికాన్ 800, కెనాన్ 5డి మార్క్ త్రి, విండోస్ -8 ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్నాయి. పాస్‌వర్డ్‌లలో నూతన శకం ప్రారంభం అయింది. వాయిస్ టెక్నాలజీకి ప్రారంభించిన నేపధ్యంలో బయో మెట్రిక్ పాస్‌వర్డ్ టచ్‌స్క్రీన్ ఐపాడ్, నోట్‌బుక్‌లలో ఇలా పనిచేస్తుందని న్యూయార్క్ యూనివర్శిటీ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెస్ నాసినర్ మెమూన్ ప్రకటించారు. దీనివల్ల టచ్‌స్క్రీన్‌పై చేతిరాతతో పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవచ్చని, ఐ-పాడ్‌లలో ఐదు మునివేళ్లతో నిమిరి పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేయవచ్చని ఆయన వివరించారు. ఇలాంటి పాస్‌వర్డ్ ద్వారా ఆయా పరికరాల పనితీరుకు లాగిన్ కావచ్చని వివరించారు. కొన్ని సందర్భాలలో డిమాండ్ సరిపడా వస్తుంవులు లభించే అవకాశం ఉండదు. ఈ నెల బ్లాక్ ఫ్రైడే సందర్భంగా వినియోగదారులు బుక్ చేసిన వస్తువులు సరఫరా చేయలేక బెస్ట్ బై చేతులు ఎత్తేసింది. దీనితో కోర్టు వ్యాజ్యాలను అది ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రముఖ ఐటి కంపెనీలు సాఫ్ట్‌వేర్ ప్రయోజనాల విషయంలో కొన్నిదేశాలలో వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు ఎక్కువ ఆవిష్కరణలు అందించి రికార్డును సృష్టించారు. అదేవిధంగా దేశంలో కాన్పూర్ ఐఐటి, చెన్నై ఐఐటిల విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేసిన ప్రాజెక్టులు కొత్త ఆవిష్కరణలకు బాటలు వేశాయి.

1 కామెంట్‌: