2, జనవరి 2012, సోమవారం

మానవ వనరుకు మంచిరోజులు

వి.ఆర్.సి.మూర్తి, November 11th, 2011
ఐటి కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకువస్తున్నాయి. ఐటి రంగం మొత్తం సెక్యూరిటీ పరంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకువచ్చాయి. అయితే మరికొన్ని రంగాలలో లక్షలాది ఉద్యోగావకావాలు వచ్చే వీలుందని నాస్‌కామ్ చెబుతోంది. అంతే కాదు సిలికాన్ వ్యాలీలో మానవ వనరుల అవసరం పెరుగుతున్న విషయమై చర్చ సాగుతోంది. అమెరికా డాలర్ బలపడినా, లేక పరిస్థితి ఇలాగే కొనసాగినా కొత్త ఉద్యోగాలకు ఢోకా ఉండబోదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రోగ్రామర్స్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రోగ్రామర్స్, ప్రాజెక్ట్ లీడర్స్, సిస్టమ్స్ ఎనలిసిస్ట్, ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ డెవలపర్లు, వెబ్ డిజైనర్లు, వెబ్‌లో జావా ప్రోగ్రామర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి రంగంలో ప్రతి సాఫ్ట్‌వేర్ కార్యాలయ అవసరాలకు ఉపయోగించడానికి వీలుగా ఎప్పటికప్పుడు సరికొత్త టూల్స్ పుట్టుకువస్తున్నాయి. కేవలం అదే టూల్స్‌ను ఉపయోగించేవారికి కంప్యూటర్‌తో నిమిత్తం లేకుండా చిప్‌లో ప్రోగ్రామ్ నిక్షిప్తం చేసి సరికొత్త పెరిఫిరల్ ద్వారా వాటిని పనిచేయించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ రంగంలో కొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకువస్తున్నాయి. గత నెలాఖరులో బెంగుళూరులో జరిగిన ఐటి కంపెనీల ప్రతినిధుల సమావేశంలో కొత్తగా వస్తున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని మానవ వనరులను తీర్చిదద్దే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించినట్లు బోగట్టా. భవిష్యత్ అవసారాలను దృష్టిలో పెట్టుకుని కొత్త శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా వివిధ ఐటి కోర్సులను నిర్వహిస్తున్న శిక్షణాసంస్థలు ఉలుకుపలుకు లేకుండా ఉన్నాయి. గతంలో నిర్వహించినంత ప్రచార ఆర్భాటాలు లేవు. అయితే పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజినీరింగ్ విద్య పూర్తిచేస్తున్న విద్యార్థులలో అభ్యర్థులను మరింత ముందుగా ఎంపిక చేసి అవసరానికి అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేపనిని సిఎస్‌ఐ లాంటి స్వచ్ఛంధ సంస్థలను పురమాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన బయలుదేరింది. ఇప్పటికే మానవవనరులను తీర్చిదిద్దే దిశగా ఎన్‌ఎస్‌డిసి (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), పలు సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఈ సంస్థలలో పనిచేస్తున్న వివిధ కంపెనీ ఉద్యోగులు తమ కార్యాలయ అవసరాలు తీరిన తరువాత తీరికవేళల్లో శిక్షణ కార్యాక్రమాల వైపు దృష్టి సారిస్తున్నారు. గతంలో ప్రధాన కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలా ప్రైవేట్ శిక్షణ సెమినార్స్‌లో పాలుపంచుకునే విషయంలో ఆంక్షలు కొంతవరకు ఉండేవి. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని మానవ వనరులను తీర్చిదిద్దే దిశగా అనుభవజ్ఞులైన ఉద్యోగులకు, నిపుణులకు కాస్త వెసులుబాటు ఇచ్చే దిశగా వివిధ ఐటి కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. ఎన్‌ఎస్‌డిసి (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఐటి రంగంలో ఉద్యోగాలు ఊహకు అందని విధంగా పెరుగుతాయని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికలను వెబ్‌లో ప్రచురించింది. ఏ రంగాలలో నిపుణుల అవసరం పెరుగుతుందో తెలిపే విధంగా నివేదికలో పొందుపరిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వీలుగా http:// www.nsdcindia.org/knowledge-bank/index.aspx వెభ్‌సైటులో సమాచారం ఉంచింది. ఇందులో మాడూళ్లుగా వివిధ విభాగాలకు చెందిన సమాచారం పిడిఎఫ్‌లలో ఉంచింది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం కూడా ఐటి రంగంలో నిపుణుల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టే పనులను ఎన్‌ఎస్‌డిసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు పురమాయించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ, కార్మిక శాఖ ఇందులో కీలక భూమికను పోషించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 12 మిలియన్ల మందిక ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇది మరింతగా 8 నుంచి 10 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డిహెచ్‌ఐ ( డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్) ఎన్‌ఎస్‌డిఎస్‌లు సంయుక్తంగా కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి