21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఐటి కెరీర్‌కు ఇక ఢోకా లేదు

ఐటి కెరీర్‌కు ఇక ఢోకా లేదు

భారత దేశంలో ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల నియామకాలకు గత రెండు నెలల క్రితమే వివిధ కంపెనీలు శ్రీకారం చుట్టగా ఈ సంవత్సరంలో సుమారు 50వేల మందిని మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించే దశలో ప్రధాన ఐటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం మళ్లీ క్యాంపస్ ఇంటర్య్వూల పేర తమ ద్వారాలు తెరిచాయి. ఈ నేపధ్యంలో ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో తదితర కంపెనీలు కళాశాలలో క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించే దిశగా పను ప్రారంభించినట్లు భోగట్టా. ఐటి రంగంలో మానవ వనరులను ప్రోత్సహించి వారికి ప్రయోజనాలు అందించే దిశలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందుగా శిక్షణ నిచ్చే పనులను ప్రారంభించింది. క్యాంపస్ ఇంటర్య్వూలలో వివిధ కంపెనీలకు సిఎస్‌ఐ చేదోడుగా ఉంటున్న విషయం విధితమే. ఇది ఇలా ఉండగా వచ్చే మూడు నెలలలోటిసిఎస్ సుమారు 30 వేల మందిని ఉద్యోగాలలో తీసుకోనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. 30 వేల మందిలో కొత్తవారికి 70 శాతం వరకు అవకాశం కల్పిస్తామని అదే విధంగా అనుభవం ఉన్న వారిని 30 శాతం వరకు ఎంపిక చేస్తామి కూడా టిసిఎస్ తెలుపుతోంది. ఇది ఇలా ఉంటే కొత్తవారి ఎంపిక కంటే గత సంవత్సరంగా ఖాళీ ఉన్న వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే దిశలో ప్రముఖ కంపెనీలు ముందుకు వెళుతున్నాయి. అయితే పట్టాతీసుకున్న తరువాత గడిపిన కాలంలో వారు ఏమి చేశారనే విషయంపైననే వౌఖిక ఇంటర్వ్యూలలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కెరీర్‌కు చాలా కాలంగా దూరం ఉన్నవారు నడుచుకున్న నడవడికపైన వారి ఆలోచన, తీరు తెన్నులు ఆధారపడుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. విప్రోసుమారు పదివేల మందికి అవకాశం కల్పించ నుండగా, మైక్రోసాఫ్ట్ ఒకడుగు ముందుకు వేసి హైదరాబాద్ క్యాంపస్‌లోని సుమారు 15 వేల మంది మానవవనరులకు అవకాశం కల్పించనున్నది. అంతే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల తగు ప్రాధాన్యత కల్పిచడానికి వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కేవలం ఈ పురోభివృద్ధి సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాలేదు. హార్డ్ వేర్ రంగంలో నిపుణులకు అవకాశాలు గుమ్మం తడుతున్నాయి. హెచ్‌సిఎల్, రాక్‌వెల్ కలిన్స్, జియోమెట్రిక్, సీమెన్స్, హనీవెల్, టాటా, టెక్ మహీంద్రా, హెగ్జావేర్ టెక్నాలజీస్ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించ నున్నట్లు ఆయా వెబ్‌సైట్లలో తెలుపుతున్నాయి. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వివరాలు క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించనున్న కళాశాలలకు పంపినట్లు భోగట్టా. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి పరిశ్రమల పురోగతి అధికంగా ఉంటుందని, దేశీయంగా 17 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశం ఉందని నాస్‌కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వెల్లడించారు. అవుట్‌సోర్సింగ్‌పై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని దేశీయ ఐటి కంపెనీలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా ఇప్పడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మరింత మెరగుపడుతుందని నాస్‌కామ్ చైర్మన్ ప్రమోద్ భాసిన్ చెప్పారు. దేశంలో ఐటి రంగంలో జరుగుతున్న అభివృద్ధిని నాస్‌కామ్ గమనిస్తోందని, వచ్చే ఆరునెలలో అవుట్‌సోర్సింగ్ రంగం పురోగతి సాధిస్తుందని నాస్‌కామ్ వెల్లడించింది.

క్రేజీ బ్రౌజర్ సరికొత్త వర్షన్

క్రేజీ బ్రౌజర్ సరికొత్త వర్షన్

ఇంటర్‌నెట్‌లో వేగంగా దూసుకు వెళ్లడానికి వీలుగా క్రేజీ బ్రౌజర్ నడుం బిగించింది. కేవలం వారం రోజుల వ్యవధిలో వినియోగదారుల ప్రయోజనాలకోసం సరికొత్త వర్షను విడుదల చేసింది. అత్యాధునిక సదుపాయాలతో క్రేజీ బ్రౌజర్ 3.03 వర్షన్ ఫిబ్రవరి 12న విడుదల అయింది. మారుతున్న టెక్నాలజీకి దర్పణం పట్టేవిధంగా ఇందులో ప్లగ్గిన్స్ జోడించారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తగా సుమారు 56 బాషలను సపోర్టు చేసే విధంగా సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా భారతీయ సపోర్టు చేయడం ప్రత్యేక ఆకర్షణ. కేవలం 0.7 ఎంబి ఫైలుతో బ్రౌజర్ రన్ అవుతుంది. సాధారణంగా అందుబాటులోకి వచ్చిన ఇతర బ్రౌజర్లతో పోలిస్తే అతి చిన్న బ్రౌజర్ ఇదే. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరల్‌లో ఉన్న సదుపాయాలను తనవిగా చేసుకుంటూ, కంప్యూటర్‌లో ఇతర సాఫ్ట్‌వేర్స్ ఉపయోగిస్తుంటే కావాల్సిన వాటిని సపోర్టు తీసుకుంటూ పనిచేయడం క్రేజీ బ్రౌజర్ ప్రత్యేకత. ఇందులో అడ్వటైజ్‌మెట్ల బాధలేదు. ఖరీదు చేయాల్సిన అవసరమూలేదు. ఉచితంగా ఆన్‌లైన్ నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్రస్ బార్‌లో టైప్‌చేసిన ప్రతి చిరునామాను ఇది గుర్తుంచకుంటుంది. అలాగని వాటికి సంబందించిన కూకీలు, ఇతర ఇమేజ్‌లను కంప్యూటర్‌లో స్టోర్ చేసుకుంటుందనుకునే భయం అక్కరలేదు. అనవసర విషయాల జోలికి ఇది వెళ్లదు. అతి తక్కువ వేగం అంటే 56 కిలోబైట్స్ వేగంతో పనిచేసే ఇంటర్‌నెట్‌లో సైతం కేవలం మూడు నిముషాలలో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ - 7, విండోస్ విస్టాతోపాటు విండోస్ ఎక్స్‌పి, విండోస్ ఎన్‌టి, విండోస్ 2000, విండోస్ 98, విండోస్ 95లలో సైతం ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే క్రేజీ బ్రౌజర్ ఉపయోగిస్తున్నవారికి కొత్త వర్షన్ వచ్చింది డౌన్‌లోడ్ చేసుకొమ్మనే సందేశం డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షం అయింది. ఒక వౌస్ క్లిక్‌తో http://www.crazybrowser.com/download.htm సైటు నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6న 3.01 వర్షన్ విడుదల చేసిన ఆరు రోజులకే మరో వర్షన్ విడుదల చేయడం ఏమిటీ అనే సందేహం కలుగవచ్చు. పాత వర్షన్‌లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఇంటర్‌నెట్‌లో విహరించడానికి వీలుగా సదుపాయాలు ఇందులో జోడించారు. మోదట 2002 సంవత్సరం జనవరి 15 తొలి క్రేజీ బ్రౌజర్ 1.0వర్షన్‌ను ఆవిష్కరించారు. ఆతరువాత ఎనిమిది సంవత్సరాల కాలంలో వరుసగా సుమారు 15 మార్లు దీనిని అప్‌డేట్ చేస్తూ వచ్చారు. వివిధ ప్రాంతీయ భాషలను సపోర్టు చేసే విధంగా c:\Program Files\Crazy Browser\Languages\ నేరుగా ఢౌన్‌లోడ్ చేసుకుంటుంది. బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేశాక ఒకమారు కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన వెంటనే కంట్రోల్ ప్యానల్ లాంగ్వేజస్ మెనూ నుంచి ప్రాంతీయ భాషలను సపోర్టు చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రత్యేక ప్లగ్గిన్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లగ్గిన్స్ C:\Program Files\Crazy Browser\Plug-ins\ నుంఛి నేరుగా పనిచేస్తాయి. వీటిని అప్‌డేట్ చేసిన వెంటనే సిస్టమ్స్‌ను ఒక మారు రీస్టార్ట్ చేస్తే చాలు బ్రౌజర్‌పై ప్లగ్గిన్స్ ప్రత్యక్షం అవుతాయి. పాప్‌అప్ బ్లాక్ చేయడంవల్ల అనవసరమైనవి సిస్టమ్స్‌లో చేరుతాయనే భయం లేదు.

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

ట్రాన్స్‌లిటరేషన్ టూల్

ప్రాంతీయ భాషలకు వెబ్‌లో గూగుల్ పట్టం కడుతోంది. ఇప్పటికే వెబ్ బ్రౌజర్ల ద్వారా ఆన్‌లైన్ పేజీ ఒపెన్ చేసిన తరువాత కావాల్సిన ప్రాంతీయ భాషలో టైప్ చేసుకునే విధానాన్ని గూగుల్ ఇదివరకే ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ ఐఎంఇ డౌన్‌లోడ్‌కు ఈ వారం సిద్దం చేసింది. ఇప్పటివరకు కేవలం బ్రౌజర్ ఒపెన్ చేసి కావాల్సిన వెబ్‌పేజీ ఒపెన్ చేసినప్పుడే ఎంచుకున్న ప్రాంతీయ భాషలో టైప్ చేసే ఏర్పాట్లను ప్రత్యేక పరిస్థితులలో కల్పించింది. కేవలం ఆన్‌లైన్‌లో ఉంటేనే ఈ సదుపాయం కలిగేది. కానీ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో కూడా ప్రాంతీయ భాష ఎంచుకునే విధంగా మొట్టమొదటి సారి యూనిక్ కోడ్‌లో టైప్‌చేసుకునేలా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌కు ఈ వారం నుంచి వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్http://www.google.com/ime/transliteration/వెభ్‌పేజీలో సిద్దంగా ఉంది. ట్రాన్స్‌లిటరేషన్ ఐఎంఇ అంటే ప్రాంతీయ భాషలోకి పదాలను మార్చుకునే ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్ అన్నమాట. ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌ను కంప్యూటర్‌లో పై సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోదు. వెంటనే తగు సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానల్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఒక భాషను ఎంచుకున్న వారికి ఒకే భాషలో టైప్ చేసుకునే సదుపాయం కలిగేలా, బహుళ బాషలు ఎంచుకున్న వారికి బహుళ భాషలలో టైప్ చేసుకునేలా ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఫాంట్స్ ఇన్‌స్టాల్‌కోసం విడివిడిగా ఆయా ప్రాంతీయ భాషలను ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, ఉర్దూ, గుజరాతీ, అరబిక్, బెంగాలీ, ఫరీషయన్, గ్రీక్ పద్నాలుగు భాషలలో ట్రాన్స్‌లిటరేషన్ ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్ లభ్యం అవుతోంది. సాధారణంగా వెబ్ పేజీల నుంచి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయగానే ప్రోగ్రామ్ మేనేజర్‌లో అప్లికేషన్ టూల్ బార్ ప్రత్యక్షం అవుతుంది. ఇందుకోసం ముందుగా కంట్రోల్ ప్యానల్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ హెల్ప్ పేజీని యూజర్‌కు మార్గదర్శకంగా నిలుస్తుంది. అలా కానీ పక్షంలో http://www.google.com/ime/transliteration/help.html#installation వెభ్‌పేజీని ముందుగా ఒపెన్ చేసి గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ ఇన్‌పుట్ మెథడ్ రన్ చేయడానికి కంప్యూటర్‌ను ఎలా సిద్దం చేయాలో తెలుసుకోవాలి. ప్రసుతం ఈ అప్లికేషన్ టూల్ విండోస్ ఎక్స్‌పి, విస్టా, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లలో పనిచేసేలా రూపొందించారు. ప్రస్తుతం ఇది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పనిచేస్తుంది. ట్రాన్స్‌లిటరేషన్ ఇన్‌పుట్ మెథడ్ కంప్యూటర్‌లో పనిచేయడం ప్రారంభించాక క్యూడబ్లుఇఆర్‌టి., కీబోర్డు ఆధారంగా టైప్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసిన పదాలు వర్డ్, నోట్‌పాడ్, అన్ని వెబ్‌పేజీలలో కట్ పేస్ట్ పద్దతిలో పేస్ట్ చేయవచ్చు. అయితే ప్రాంతీయ భాషలలో వెబ్‌పేజీలను రూపొందించుకోవడానికి వీలుగా ఇదివరకే గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ పద్దతిని చాలా కాలం క్రితమే ప్రవేశపెట్టింది. ఆర్కుట్, జి-మెయిల్, బ్లాగ్‌లలో నేరుగు కంపోజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది. లిప్యాంతరీకరణ పద్దతిలో కావాల్సిన పదాలను తెలుగులో ఉచ్చారణకు అనుగుణంగా ఇంగ్లీషు కీబోర్డుపై టైప్ చేసి స్పేస్ ఇచ్చిన వెంటనే అది తెలుగు పదం కనిపించేలా గూగుల్ దీనిని ప్రవేశ పెట్టింది. ఇలా టైప్ చేసిన పదం వెబ్‌పేజీల అప్‌లోడ్‌కు కానీ, ఇ-మెయిల్‌లో లేఖలా కానీ పంపుకునే సదుపాయం కల్పించింది. ఆఫ్‌లైన్‌లో కూడా యూనిక్‌కోడ్‌లో కావాల్సిన ప్రాంతీయ భాషలో టైప్ చేసుకుని సదరు ఫైళ్లను కంప్యూటర్‌లో సేవ్ చేసుకున్న తరువాత వెబ్‌లోకి అప్‌లోడ్ చేసుకునే విధానం వల్ల యూజర్లకు మరింత ప్రయోజన కరంగా ఉంటుంది. అంతే కాకుండా నాన్ లాటిన్ భాషలలో కూడా వెబ్‌పేజీలు చక్కగా దర్శనం ఇచ్చే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో గూగుల్ లాబ్ అందించిన వెబ్ పేజీ http://labs.google.co.in/keyboards/telugu.html కూఢా ప్రాంతీయ భాషలలో ఇంటర్‌నెట్ ఆన్‌లైన్‌లో టైపింగ్‌కు సదుపాయం కల్పించింది